జోగులాంబ గద్వాల : ప్రస్తుత విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ( Government Schools ) విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ( Collector Santosh ) విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో మండల విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు విద్యాశాఖలో అన్ని విభాగాలలోని మార్పులను, పురోగతిని వివరాలను పూర్తిగా విశ్లేషించుకొని తగిన సూచనలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపడిన మౌలిక సదుపాయాలు, ఉత్తీర్ణత, కొత్తగా భర్తీ అయిన ఉపాధ్యాయ ఖాళీలు, నాణ్యమైన విద్యాబోధన, ఉచిత యూనిఫామ్ లు, పాఠ్యపుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్న విషయాల గురించి ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో అధిక సంఖ్యలో చేర్పించేందుకు కృషి చేయాలని సూచించారు.
జీరో ఎన్రోల్మెంట్ ఉన్న పూటన్పల్లి, బస్వాపూర్, మిర్జాపూర్, ఏదులగూడెం గ్రామాల్లో నాలుగు ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాలని సూచించారు. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో చేరేలా మండలాల వారీగా పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ అధికారికి ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి హృదయ రాజు, ఎంఈవోలు, జిల్లా కో ఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.