గద్వాల : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో( PHC ) ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ( Collector Santosh ) అధికారులను ఆదేశించారు. ఇటిక్యాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు నాణ్యమైన సత్వర సేవలు అందించాలని ఆదేశించారు. ఓపీ(OP) , ఐపీ( IP ) రోగుల వైద్య సేవలు మరింత మెరుగ్గా పరచాలని తెలిపారు.
ఆసుపత్రుల్లో వంద శాంతం నార్మల్ డెలివరీలు( Normal deliveries ) చేయాలన్నారు. గర్భిణీలకు అవగాహన కల్పించి, అవసరమైన ఐరన్, కాల్షియం టాబ్లెట్లు సమయానికి అందించాలన్నారు.హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న గర్భిణీలను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గర్భిణీల పల్స్ రేట్ చెకప్, స్కానింగ్ సమయానికి జరిగేలా చూసి, వారిని సమయానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తూ ఉండేలా ప్రోత్సహించాలన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. బేబీ వార్మ్, స్టెరిలైజేషన్ పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. గ్రామాల్లో 30 సంవత్సరాలకు పైబడిన వారిని గుర్తించి వారిలో లో బీపీ, షుగర్ లాంటి వ్యాధులను గుర్తించి అవసరమైన మందులు అందజేయాలన్నారు.
అనంతరం తహసీల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి భూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వీర భద్రప్ప, డాక్టర్ అనిరుధ్, రెవిన్యూ, వైద్య సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.