Jungle Safari | నల్లమలనే కాదు.. పాలమూరు కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు సైతం సఫారీ టూర్‌కు కేరాఫ్‌గా మారనున్నది. పార్కు నుంచి ఫత్తేపూర్ మైసమ్మ ఆలయం వరకు సుమారు 13 కి.మీ. జంగల్ సఫారీ ప్రారంభంకాబోతున్నది. ఇందుకోసం అటవీ, పర్యాటక శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఫారెస్ట్ మధ్యలో ఉన్న గోల్ బంగ్లా వ్యూ పాయింట్ నుంచి ప్రకృతి అందాలు, వన్యప్రాణులు, జంతువుల సంచారాన్ని సందర్శకులు తిలకించేలా ఏర్పాట్లు చేయ నున్నారు. ఆద్యంతం ప్రయాణం మధురానుభూతిని మిగిల్చేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. మధ్య మధ్యలో ఆగి వీక్షించేలా.. సేద తీరేందుకు హోటల్.. రాత్రిళ్లు బస చేసేందుకు చెక్కలతో కాటేజీలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకునేలా ప్రత్యేక యాప్‌ను అందు బాటులోకి తేనున్నారు. ఇటీవల పర్యాటక శాఖ అధికారులతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రయల్న్ విజయవంతమైంది. దీంతో పర్యాటక హబ్‌గా పాలమూరు మారబోతున్నది.
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగ ర్ జిల్లాలో ఆహ్లాదం, అడ్వెంచర్లు చేయాలనుకునే వారికి ఠక్కున గుర్తొచ్చేది నల్లమల అటవీ ప్రాంతం.. అక్కడకు వెళ్లాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి.. ముందే ప్లాన్ చేసుకోవాలి.. కానీ, ఇప్పుడు ఎలాంటి రిస్క్ లేకుండా నల్లమలను పోలిన అటవీ ప్రాంతం మన పాలమూరు చుట్టుపక్కలే ఉన్నది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులో ఉన్న కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు జంగల్ సఫారీకి వేదిక కానున్నది. దట్టమైన అడవిలో తిరుగుతూ జంతువులను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించనున్నది. ఇందుకు అటవీ, పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2,087 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎకో అర్బన్ పార్కులో సఫారీ, అడ్వెంచర్, ట్రెక్కింగ్, మూన్‌లైట్‌లో గడిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల నవాబ్‌పేట మండలం ఫత్తేపూర్ మైసమ్మ ఆలయం నుంచి కేసీఆర్ అర్బన్ పార్క్ వరకు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ట్రయల్న్ నిర్వహించారు. అటవీ అందాలను చూసి ముగ్ధులయ్యారు. అటవీ ప్రాంతం మధ్యలో బ్రిటీష్ వాళ్లు అత్యంత ఎత్తయిన ప్రదేశంలో గోల్‌బంగ్లా నిర్మించారు. అక్కడి వ్యూ పాయింట్ నుంచి చూస్తే చుట్టుపక్కల 25 కిలోమీటర్ల దూరం వరకు అటవీ అందాలుకనిపిస్తాయి. రెండస్తుల్లో ఉన్న ఈ గోల్ బంగ్లాపైకి వెళ్లడానికి మెట్లు ఉన్నాయి. శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనాన్ని అటవీ శాఖ అధికారులు పునరుద్ధరించారు. ఇక్కడి నుంచి బైనాక్యులర్‌లో చూస్తే ఉదండాపూర్, కరివెన రిజర్వాయర్లు కూడా కనిపిస్తాయి. ఫత్తేపూర్ మైసమ్మ ఆలయం నుంచి కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని సఫారీ టూర్‌గా మార్చి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జంగల్ సఫారీకి కావాల్సిన వాహనాలు, పర్యాటకులకు కావాల్సిన వసతులు, చూడదగిన ప్రదేశాలను బ్లూ ప్రింట్ రెడీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఏఏ ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకురావాలనే విషయాపై చర్చిస్తున్నారు. కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్, గోల్‌బంగ్లా వ్యూ పాయింట్, మైసమ్మ ఆలయం విజిట్ ఒక ప్యాకేజీగా.. అటవీ ప్రాంతంలో స్టే, ట్రెక్కింగ్ చేయడం రెండో ప్యాకేజీ కింద విభజించాలని భావిస్తున్నారు. అంతేకాకుండా స్కైవే, అతిపెద్ద వీల్‌ను కూడా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేయనున్నారు.
Mantri Srinivas Goud
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి జడ్చర్ల వెళ్లే రహదారిలో మయూరీ నర్సరీ ఉండేది. సమైక్య పాలనలో కేవలం మొక్కలు పెంచేందుకు నర్సరీగా మాత్రమే వినియోగించుకునేవారు. స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ హయాంలో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృషితో మయూరీ నర్సరీ రూపురేఖలే మారిపోయాయి. మహబూబ్‌నగర్, నవాబ్‌పేట, జడ్చర్ల మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాన్ని కలుపుకొని 2,087 ఎకరాల్లో కేసీఆర్ ఎకో అ ర్బన్ పార్కుగా రూపాంతరం చేశారు. దేశంలోనే అతిపెద్ద పార్కుగా చరిత్ర సృష్టించింది. నెమళ్లు, జిం కలు, వివిధ రకాల పక్షులు, అనేక ర కాల వృక్షాలు, ఔషధ గుణాలున్న చెట్లు ఉన్నాయి. ఈ అటవీ ప్రాంతంలో రెండు కోట్ల విత్తన బంతులను వెదజల్లారు. దీంతో ఈ రెండేండ్లలోనే కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ పూర్తిస్థాయిలో పచ్చదనం పరుచుకున్నది. చలికాలంలో ఊటీని తలపిస్తున్నది. పార్కులో పర్యాటకుల కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పించడం తో నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతున్నది. వా రంతరాల్లో రద్దీ ఎక్కువగా ఉంటున్నది. ఇప్పుడు జంగల్ సఫారీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ నుంచి ఫత్తేపూర్ మైసమ్మ ఆలయం వరకు అటవీ ప్రాంతంలో 13 కిలోమీటర్ల మేర రహదారి ఉన్నది. ఈ దారి మీదుగా అధికారులు నిత్యం వాహనాల్లో వెళి రిజర్వ్ ఫారెస్ట్‌ను వాచ్ చేస్తుంటారు. చెట్లు, కీటకాలు, జంతువులు, పక్షులు, సర్పాలు ఇలా కనిపించే వాటిని పర్యవేక్షిస్తుంటారు. అటవీ ప్రాంతం ఎండిపోకుండా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ రహదారిలోనే పర్యాటకులకు వీలుగా సఫారీ టూర్ కోసం రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం టాప్‌లెస్ వాహనాలు, అక్కడక్కడడా ఆగి అటవీ ప్రదేశాలను వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్‌బంగ్లా వ్యూపాయింట్, మధ్యలో స్టే చేసేందుకు ప్రత్యేక వసతి గృహాలు, హోటల్ వంటి వసతులను సమకుర్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాత్రిపూట బస చేసేందుకు చెక్కలతో నిర్మించిన ప్రత్యేక కాటేజీలను ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఆన్లైన్లో సఫారీ టూర్ బుకింగ్ చేసుకునేలా ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ నుంచి ఫత్తేపూర్ మైసమ్మ ఆలయం వరకు జంగల్ సఫారీ అందుబాటులో తీసుకురావాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. అ డ్వెంచర్ యాక్టివిటీ, ట్రెక్కింగ్, వ్యూపాయింట్, హోటల్ వస తి ఏర్పాటు చేయనున్నాం. ఈ టూర్లో ఆహ్లాదంతోపాటు అ టవీ అందాలను వీక్షించేందుకు కావాల్సిన వాహనాలను ప్రత్యేక డిజైన్‌లో రూపొందిస్తాం. ఎక్కడో ఉన్న నల్లమల కన్నా మన చుట్టూ ఉండే దట్టమైన అటవీ ప్రాంతంలో సఫారీ టూర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచించాం. భవిష్యత్‌లో కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ దేశంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారుతుంది.
– శ్రీనివాస్‌గౌడ్, పర్యాటక శాఖ మంత్రి