గద్వాల, ఫిబ్రవరి 3 : గద్వాల కాంగ్రెస్‌లో నామినేషన్లు ప్రారంభం మొదలు, ఉపసంహరణ చివరి నిమిషం వరకు బీఫామ్స్ విషయంలో హైడ్రామా కొనసాగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మధ్య ఉన్న అంతర్గత విబేధాలు తన సొంత క్యాడర్‌ను అయోమయంలోకి నెట్టేసింది. ఎన్నికల కోడ్ రాక ముందు నుండే బీఫామ్స్ విషయంలో అటు సరిత, ఇటు ఎమ్మెల్యే వర్గం తమకే బీఫామ్స్
వస్తాయని ఎవరి ధీమాలో వారు ఉన్నారు. కానీ బీఫామ్స్ విషయంలో సరిత అనుచరులకు చివరి వరకు నిరాశే మిగిలింది. ఎమ్మెల్యే వర్గానికే
మొత్తం బీఫామ్స్ వస్తాయని కొందరు లేదు సరిత వర్గానికి కొన్ని బీఫామ్స్ వస్తాయని వారి అనుచరులతోపాటు కార్యకర్తలు
అనుకున్నారు.
కానీ అందరి ఆశలు గల్లంతు అయ్యేలా చివరి వరకు ఎమ్మెల్యే వర్గానికి ఎన్ని బీఫామ్స్ ఇచ్చారు. సరిత వర్గానికి ఎన్ని ఇచ్చారో చెప్పలేని స్థితితో డీసీసీ అధ్యక్షులు ఉండడం, తాను కన్వీనర్‌ను మాత్రమే అని అంతా మంత్రికి తెలుసని వివరాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే గద్వాల మున్సిపాలిటీకి సంబంధించి 36 వార్డుల్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తాను బరిలో నిలిపిన అభ్యర్థులకు సంబంధించి బీఫామ్స్ ఇచ్చి ఆగమేఘాల మీద ఆర్వోకు అందజేశారు. కాగా మాకు అధిష్టానం ఏడు వార్డులకు సంబందించి బీఫాం పార్టీ కేటాయించిందని సరిత వర్గానికి చెందిన కొందరు ఫామ్స్‌తో దర్శనమిచ్చారు. సరిత సడన్ ట్విస్ట్ ఇవ్వడంతో ఆ ఏడు వార్డులో ఎమ్మెల్యే తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు కంగుతిన్నారు. మా ఫాం ఉంటుందా.. ఊడుతుందా అనే సందిగ్ధంలో పడ్డారు.