Amarachinta | అమరచింత, మార్చి 25 : మండలంలోని రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ. 10 కోట్ల నిధులతో ధర్మాపూర్ శివారులో నిర్మాణం చేపట్టిన గిడ్డంగుల సంస్థ గోదాంలో కూలీలకు, ఇక్కడికి ధాన్యం తీసుకువచ్చే లారీ డ్రైవర్లకు కనీస సౌకర్యాలు కరువై మంచినీటి కోసం అల్లాడుతున్నారు. దీంతో కూలీలు, లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు స్పందించి ధాన్యం నిల్వలు చేసే కూలీలకు, ధాన్యం తీసుకువచ్చే లారీ డ్రైవర్లకు మంచినీటి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ సందర్భంగా మంగళవారం గిడ్డంగుల సంస్థ గోదాంలో హమాలీలుగా పనిచేస్తున్న బీహార్ వాసులు.. ఇక్కడకు ధాన్యం తీసుకువచ్చిన లారీ డ్రైవర్లు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. అటు మండల కేంద్రానికి ఇటు ధర్మాపూర్, నాగల కడుమూరు గ్రామానికి కిలోమీటర్ దూరంలో నిర్మాణం చేపట్టిన సివిల్ సప్లై గోదాముకు నారాయణపేట జిల్లా కొడంగల్, మద్దూర్, మరికల్, మక్తల్ తదితర గ్రామాల నుంచి లారీల్లో సన్న బియ్యం ఇక్కడ గోదాంలో నిల్వ చేసేందుకు తీసుకువచ్చి నాలుగు రోజులు అవుతున్న కూలీలు ధాన్యమును గోదాంలో నిలువ చేయడం లేదని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం లారీలను గోదాం లోపలికి రానివ్వకపోవడంతో బయటే నిలుపుకొని ఎదురుచూస్తున్నామని, సమయానికి తిండి లేక కనీసం గోదాంలో మంచినీరు తాగుదామన్న దొరకడం లేదని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సివిల్ సప్లై అధికారులు ధాన్యం నిలువలు చేసుకునే గుత్తేదారులు తమ బాధను అర్థం చేసుకొని గోదాంలో కనీస సౌకర్యాలు కల్పించాలని లారీ డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
గిడ్డంగుల సంస్థ చైర్మన్ దివంగత సాయిచంద్ అమరచింత మండలంలో రైతుల పండించిన పంటను పదివేల టన్నుల వరకు నిలువలు చేసుకునేందుకు 10 కోట్ల నిధులతో గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో గోదాం నిర్మాణ పనులను చేయగా అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రారంభం చేయకుండానే గత పక్షం రోజుల నుంచి ప్రభుత్వం రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు సబ్సిడీపై అందించే సన్న బియ్యం గోదాంలో నిల్వలు చేస్తుండగా అక్కడ పనిచేసే బీహార్‌కు సంబంధించిన కూలీలు, ధాన్యమును తీసుకొచ్చే లారీ డ్రైవర్లతో పాటు సిబ్బంది సైతం మంచినీరు దొరక్క దాదాపు మూడు కిలోమీటర్లు వచ్చి నీటిని తీసుకెళ్లాల్సిన దరిద్రం ఏర్పడింది. ఇప్పటికైనా సివిల్ సప్లై అధికారులు, గుత్తేదారులు లేదా ప్రజా ప్రతినిధులు స్పందించి కూలీలకు లారీ డ్రైవర్లకు కనీస సౌకర్యాలను కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై సివిల్ సప్లై గోదాం అధికారి సోమయ్యను నమస్తే తెలంగాణ వివరణ కోరగా గోదాంలో డిపార్ట్మెంట్కు సంబంధించిన బోరు ఉందని కూలీలు లారీ డ్రైవర్లు ఆ నీటిమే తాగాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వారికి నీటిని సప్లై చేసే ఉద్యోగం తనది కాదని ఆయన దురుసుగా మాట్లాడారు.