మహబూబ్‌నగర్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆ క్లబ్లో సభ్యుడుగా చేరాలంటే పలుకుబడి హోదా కావాల్సిందే.. రాజకీయ నేతల నుంచి మొదలుకొని అధికారులు, లాయర్లు, డాక్టర్లు రూ.లక్షల్లో ఫీజు చెల్లించి క్లబ్ మెంబర్షిప్ తీసుకుని దాన్ని ఓ పేకాట గృహంగా మార్చేశారు.. అంతటితో ఆగకుండా క్లబ్ పేరుపై ఏకంగా బార్ అండ్ రెస్టారెంట్ పర్మిషన్ తీసుకుని సభ్యులు జల్సా చేస్తున్నారు.. అంతా పట్టణ ప్రముఖులే.. అయితే చట్టంతో మాకేం పని.. మా జోలికి ఎవరు వస్తారనే ధీమాతో రూ.కోట్లలో ఖర్చుపెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా ఆరు అంతస్థులతో భవన నిర్మాణం చేపట్టారు. ఇది జిల్లా న్యాయస్థానం ఎదురుగానే దర్జాగా నిర్మిస్తున్నారు. నిర్మాణానికి కావలసినవన్నీ క్షణాల్లో వాలిపోయాయి.. ఇంకేముంది రూ.10 కోట్లు ఖర్చుపెట్టి ఆరు అంతస్థులకు పైగా విలాసవంతమైన సౌకర్యాలతో నిర్మాణాలు చేపట్టారు.
మామూలు వ్యక్తులు ఇంటి పర్మిషన్ లేకపోతే మెటీరియల్ ఎత్తుకుపోయే నగరపాలక సంస్థ ఎందుకో ఏమో ఇంత భారీ నిర్మాణం జరుగుతున్నా అటువైపు కనీసం కన్నెత్తి చూడలేదు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న ఈ భవనానికి సేఫ్టీ మెజర్మెంట్స్ కావాలి.. సంబంధిత అధికారుల నుంచి కూడా అనుమతులు కూడా లేవని తెలుస్తోంది. ఈ విలాసవంతమైన క్లబ్లో అధికారం చలాయించేందుకు నానా పాట్లు పడుతున్నారు. జిల్లా క్లబ్ ఎన్నికల్లో పెత్తనం చెలాయించేందుకు అధికార పార్టీ అనేక ప్రయత్నాలు చేసినట్లు.. క్లబ్ సభ్యులు దాన్ని తిప్పి కొట్టినట్లు.. ప్రచారం జరుగుతున్నది. ఇంత జరుగుతున్న అక్రమ నిర్మాణం అడ్డంకుల్లేకుండా కొనసాగించేందుకు కొత్తగా వచ్చిన కార్యవర్గం సభ్యులకు హామీలు కూడా ఇస్తుందట..లక్షల్లో నగరపాలక సంస్థ ఆదాయానికి గండి..ఒక భవన నిర్మాణం చేపట్టాలంటే స్థానిక కౌన్సిలర్‌తో మొదలుకొని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వరకు చెప్పులు అరిగేలా తిరగాలి.
అయినా అనుమతి ఇస్తారని గ్యారెంటీ లేదు. గవర్నమెంట్‌కు కట్టే చాలన్ చారణా ఉంటే అంతకు డబుల్ త్రిబుల్ సమర్పించుకోవాల్సిందే. మళ్లీ అప్పుడప్పుడొచ్చి సతాయిస్తారు. కానీ పట్టణ నడిమధ్యలో అందులో జిల్లా న్యాయస్థానం ఎదుట నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణానికి అనుమతులే తీసుకోలేదంటే ఆశ్చర్యం వెయ్యకమానదు. పదిమందికి ఆదర్శంగా నిలవాల్సిన పట్టణ ప్రముఖులు.. మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే అనే ధీమాతో భవన నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో నగరపాలక సంస్థ రూ.లక్షల్లో ఆదాయం కోల్పోయింది. అక్రమ నిర్మాణం జరుగుతున్న కనీసం ఒక నోటీసు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. సామాన్యులు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టే నగరపాలక సంస్థ ఈ విషయంలో మాత్రం ఉదాసీనత వైఖరి అవలంభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంత జరుగుతున్నా క్లబ్లో ఆధిపత్యం కోసం కొట్లాటలు కొనసాగుతూనే ఉన్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లా క్లబ్‌కు అనుమతులు లేవనే విషయం మాకు తెలియదు.. ఇంతవరకు నోటీస్ చే యలేదు.. ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు.. ఒక వేళ అనుమతులు లేకపోతే క్లబ్ నిర్మాణ పనులు ఆపి యాక్షన్ తీసుకుంటాం.
– ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్, మహబూబ్‌నగర్