పాన్‌గల్, జనవరి 23 : అసెంబ్లీ ఎన్నికల్లో ఓట మి పాలయ్యామని ఎవరూ అధైర్యపడొద్దని.. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి రానున్న స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలకేంద్రంలో బీఆర్ఎస్ ము ఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అభిలాష్రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశముందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో మండలాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చే యడం జరిగిందని.. మరింత అభివృద్ధి కోసం అనేక పనులను మంజూరు చేయించామని వాటిని ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశా రు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున రైతులకు ఇబ్బందులు కలుగకుండా నీటి వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి వంద రోజుల సమయం ఇచ్చామని, ఆ లోపు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.