మహబూబ్‌నగర్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల పర్యటన కంటితుడుపుగా సాగిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. జూరాలలో ఐరన్ రోప్‌లు తెగడం సాధారణమైతే అసలు పర్యటనకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఆ సమస్యతో ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందులు లేకుంటే ఆఘమేఘాల మీద మంత్రి పర్యటన ఎందుకని నిలదీశారు. జూరాలకు వచ్చిన మంత్రి స్పిల్ వే, క్రస్ట్ గేట్లు, ఐరన్ రోప్‌లు తెగిన వాటిపై ఎందుకు పరిశీలన చేయలేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మంత్రులు కేవలం మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ధ్వంసమైన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నిలబెట్టారని చెప్పారు. కేవలం ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరిగి సమూలంగా నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కుట్రలకు ప్రజలు సమాధానం చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు.
ప్రాజెక్టులపై కాంగ్రెస్ పట్టనితనం ప్రజలకు శాపంగా మారుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగితే నానా యాగీ చేసిన రేవంత్ సర్కారు.. దానికి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలన్న సోయి లేకుండా పోయింది. ఫలితంగా రైతులు తమ పంటలను ఎండబెట్టుకునే పరిస్థితి వచ్చింది. తాజాగా, జూరాల ప్రాజెక్టు విషయంలోనూ కాంగ్రెస్ అదే అలసత్వం ప్రదర్శిస్తున్నది. సకాలంలో మరమ్మతులు చేయించకపోవడంతో జూరాల క్రస్ట్ గేట్లు ప్రమాదం అంచున ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కమిటీ నివేదిక మేరకు జూరాల మరమ్మతులకు రూ. 12 కోట్లు కేటాయించారు. అయితే, మరమ్మతులు పూర్తిచేసే లోపే అధికారం మారడంతో ఆ తర్వాత పనులను పట్టించుకునే వారు కరువయ్యారు. సరిగ్గా మరమ్మతులు చేసే సమయంలో వరద రావడంతో 8 గేట్లలో నాలుగు గేట్ల రోప్‌వేలు తెగిపోయాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాలకు పెద్ద ఎత్తున వరద వస్తున్నది. వరద ఉధృతిలో బలమైన రాళ్లు కొట్టుకొస్తే ప్రాజెక్టు గేట్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోని జూరాల ప్రాజెక్టు మరమ్మతులను గాలికి వదిలేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం జూరాల ప్రాజెక్టుకు వచ్చిన ముప్పేమీ లేదని బుకాయిస్తున్నది. ప్రాజెక్టు గేట్ల రోప్‌వేలు తెగిపోయిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు గురువారం ప్రాజెక్టు సైట్‌ను సందర్శించారు. కాళేశ్వరంలో ఒకటి, రెండు పిల్లర్లు కుంగిపోతే మరమ్మతులు గాలికి వదిలేసి ప్రాజెక్టు మునిగిపోయిందని ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ సొంత జిల్లాలో జూరాల ప్రాజెక్టును డేంజర్ జోన్లో పడేశారని ఆరోపించారు.
దివంగత ఇందిరాగాంధీ పేరు వచ్చేలా ఈ ప్రాజెక్టుకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (పీజేపీ)గా నామకరణం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు నిర్వహణను గాలికి వదిలేశారు. దీంతో కుడి, ఎడమ కాల్వలు శిథిలావస్థకు చేరాయి. చాలాచోట్ల పిల్లర్లు దెబ్బతిన్నాయి. దీంతో ఆందోళన వ్యక్తంచేసిన ఇంజినీర్లు గత ప్రభుత్వానికి నివేదిక అందించారు. స్పందించిన కేసీఆర్ ప్రభుత్వం వెంటనే ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ప్రతి ఏటా మరమ్మతులకు నిధులు కేటాయిస్తూ వచ్చింది. 2022లో ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికతో మరమ్మతుల కోసం రూ.12 కోట్లతో టెండర్లు పిలిచారు. రాష్ట్రంలో గేట్ల మరమ్మతుల్లో ఆరితేరిన స్వప్న కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ పనులు దక్కించుకున్నది. మరమ్మతులు ప్రారంభించే లోపే ప్రభుత్వం మారింది. ఈ క్రమంలో సర్కారు వద్ద రూ. 8 కోట్ల బిల్లులు బకాయిపడ్డాయి. కాంగ్రెస్ సర్కారు వచ్చి 18 నెలలైనా నాటి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఖర్చు చేయకపోవడం, బకాయిలు చెల్లించకపోవడంతో ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకమైంది.