వనపర్తి, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : నెల్విడి ఎత్తిపోతల పథకం కింద ఎండుతున్న పంటలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇటు అధికారులు.. అటు ప్రజా ప్రతినిదులు ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓ పక్షం రోజులు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తే ఎండిపోయే పంటలన్నీ చేతికి వస్తాయి. నెల రోజుల నుంచి ఈ ఎత్తిపోతల పథకంలోని స్టేజీ1, స్టేజీ 2లకు విద్యుత్ కనెక్షన్ లేకపోవడం, స్టేజీ 2 ట్రాన్స్ఫార్మర్లోని సామగ్రిని దొంగలు ఎత్తుకుపోవడంతో నీళ్లున్నా నిష్ప్రయోజనంగా మారింది. కేవలం 15 రోజులు నీరందింతే దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా వరి పంటలు పండుతాయి. ఇప్పటికే చాలా బోర్లు నీరందించలేక తగ్గిపోవడంతో పంట పొలాలు చాలా వరకు ఎండి పోతున్నాయి. మదనాపురం మండలంలోని కొన్నూరు, ద్వారకానగర్, నర్సింగాపురం గ్రామాల పరిధిలోని రైతులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు.
1200 ఎకరాలు ఎండితే ఎవరికి లాభం..
నెల్విడి ఎత్తిపోతల పథకంలోని స్టేజీ-2 కింది వరి చేలు ప్రమాదం అంచున ప్రయాణం చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు రైతుల పంట పొలాలు పూర్తిగా ఎండిపోయాయి. విధిలేక పశువులకు మేతగాను చేసుకున్నారు. మరోవారం గడిస్తే పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది. స్టేజీ 1లోని పంటలకు అంతగా ఇబ్బంది లేదు. కేవలం స్టేజీ 2లో 1900 ఎకరాల ఆయకట్టు ఉంటే, నెల రోజుల నుంచి నీటికష్టాలు మొదలయ్యాయి. బోర్లు ఎండిపోవడంతో రైతులు నిస్సహాయులవుతున్నారు. ఎత్తిపోతల పథకంలోని ట్రాన్స్ఫార్మర్ సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లడంతో సమస్య ఏర్పడింది. విద్యుత్, ఇరిగేషన్ అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులను రైతులు కలిసి సాగునీరు అందించమని మొర పెట్టుకున్నా చలనం లేదు. స్థానిక ఎమ్మెల్యేతోపాటు కలెక్టర్‌కు కలిసిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఈ ఆయకట్టు పరిధిలోని 1200 ఎకరాల్లో వరి పంట ప్రమాదంలో పడిందని, పంటలు ఎండిపోతే ఎవరికి లాభం అన్న చర్చ కొనసాగుతున్నది.
రెండు సార్లు ఎమ్మెల్యేను కలిసినం
పంటలు ఎండిపోతున్నాయని రైతులు కొందరు నాదగ్గరకు వచ్చారు. ఎత్తిపోతల పథకంలో ట్రాన్స్ఫార్మర్ సామగ్రిని దొంగలు తీసుకెళ్లారని, ఎలాగైనా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరాం. విద్యుత్ డీఈకి చెబుతా.. వెళ్లి కలవండి అని ఎమ్మెల్యే చెప్పారు. కొందరు రైతులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లి స్వయంగా రెండుసార్లు ఎమ్మెల్యేకు మొరపెట్టుకుని వచ్చాం. అయినా అధికారుల్లో చలనం లేదు. రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది. చేతికి వచ్చిన చేలన్నీ ఎండుపోతుంటే గుండె తరక్కుపోతున్నది.
– గూడుషా, సర్పంచ్ భర్త, కొన్నూరు, మదనాపురం మండలం, వనపర్తి జిల్లా
అడ్డుకట్ట వేసి ఆదుకున్న నిరంజన్‌రెడ్డి
శంకర సముద్రం రిజర్వాయర్‌కు పూర్తి స్థాయిలో నీటిని నింపడం లేదు. కానాయిపల్లి గ్రామం ఖాళీ చేయనందునా రిజర్వాయర్‌ను నింపే అవకాశం లేదు. ఈ క్రమంలో రిజర్వాయర్ ఆధారంగా ఏర్పాటు చేసిన కాల్వలకు నీరందే పరిస్థితి లేదు. కొంత మేర వచ్చినప్పటికీ కాల్వకు అందే పరిస్థితి లేదు. సాగునీటి కరువును ఎదుర్కొన్న రైతులు అప్పట్లో ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడుగా ఉన్న సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో నీటి బాధలను పంచుకున్నారు. తక్షణమే స్పందించిన సింగిరెడ్డి ఆగమేఘాల మీద ప్రత్యామ్నాయ మార్గంను ఆలోచించి ఓ అడ్డకట్టను నిర్మాణం చేయించి రైతుల కళ్లలో ఆనందం నింపారు. ఇలా నాటి నేతలు రైతులకు ఎక్కడైనా సాగునీటి కష్టమొస్తే…వారిని అక్కున చేర్చుకుని పంటలకు సాగు నీరందించిన వాటికి సాక్ష్యాలు చెరిపేస్తే పోయేవి కాదు. నిరంజన్‌రెడ్డి ఏర్పాటు చేసిన అడ్డుకట్ట ద్వారా 2014 నుంచి భీమాలోని 27వ ప్యాకేజీ కాల్వ నుంచి రైతులు రాసుల పంటలను పండిస్తున్నారు. 8 మండలాల రైతులకు సాగునీరందించి అపరభగీరథుడు అనిపించుకున్నాడు సింగిరెడ్డి.
నాడు అక్కున చేర్చుకున్న ఆల
అప్పట్లో దేవరకద్ర ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పలు సందర్భాల్లో రైతులను అక్కున చేర్చుకున్నారు. శంకరసముద్రం రిజర్వాయర్ కుడి కాల్వకు సాగు నీరందడం లేదని కొత్తకోట మండలంలోని పలు గ్రామాల రైతులు ఆల వెంకటేశ్వర్ రెడ్డితో మొర పెట్టుకున్నారు. దీనిపై వెంటనే స్పందించిన ఆల అప్పటి ఎంపీపీ గుంత మౌనికతోపాటు పలువురు నాయకులను పురమాయించి ఏకంగా పది మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లను రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసి కాల్వకు నీరు పారించి రైతులకు మేలు చేశారు. ఇది జరిగి ఆరేళ్లవుతుంది. ఆ రైతులకు ఇప్పటి వరకు కూడా ఆల ఏర్పాటు చేసిన మోటర్ల ద్వారానే సాగునీరు కాల్వల ద్వారా అందుతున్నాయని అన్నదాతలు చెప్పుకుంటున్నారు. ఈ మోటర్ల ద్వారానే వానకాలంలో 4 వేల ఎకరాలు, యాసంగిలోను 2500 ఎకరాలకు ఈ మోటర్ల ద్వారా నిర్విన్, పాలెం, కనిమెట్ట తదితర గ్రామాలకు సాగునీరును అందిస్తున్నారు.
నేడు పాలమూరుకు హరీశ్‌రావు
మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 2 : మహబూబ్‌నగర్ పట్టణంలో నిర్వహించే దొడ్డి కొమురయ్య జయంతి వేడుకల్లో పాల్గొనడానికి సిద్దిపేట ఎ మ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శుక్రవారం జిల్లా కేంద్రానికి వస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో జరిగే ఓ కార్యక్రమానికి వెళ్తున్న ఆయన జి ల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ సాయు ధ పోరాట యోధు డు కొమురయ్య జయంతి వేడుకల్లో పాల్గొంటున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆహ్వానం మేరకు హరీశ్‌రావు వస్తున్నారని.. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ మం త్రులు మీడియా సమావేశంలో పాల్గొంటారన్నారు.
బావోజీ బ్రహ్మోత్సవాలకు..
మద్దూర్ (కొత్తపల్లి), ఏప్రిల్ 2 : కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలోని గురులోక్ మసంద్(బావోజీ) బ్రహ్మోత్సవాలకు మాజీ మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డితోపాటు మా జీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, ఎస్. రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ హాజరుకానున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.
76 మందికి షోకాజ్ నోటీసులు
గద్వాలటౌన్, ఏప్రిల్ 2 : జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నైజ్ సిస్టం) హాజరు విధానాన్ని సక్రమంగా నిర్వహించకపోవడంతో 76 మంది విద్యాశాఖ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్‌బాషా గురువారం ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదుపై సమగ్రంగా పరిశీలించగా పలుచోట్ల హాజరు సక్రమంగా నమోదు కాకపోవడాన్ని గమనించినట్లుగా పేర్కొన్నారు. మొత్తం 61 పాఠశాలల్లో 76 బోధన, బోధనేత సిబ్బందికి నోటీసులు ఇచ్చామని, వారు మూడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం నిర్ధేశించిన విధి విధానాలకు ఖచ్చితంగా పాటించాలని లేనిచో చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
అవుట్ సోర్సింగ్ టీచర్ సస్పెన్షన్
నారాయణపేటరూరల్, ఏప్రిల్ 2 : జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో అవుట్ సోర్సింగ్ టీజీటీ ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న జహంగీర్ మంగళవారం నైట్ డ్యూటీలో ఆరవ తరగతి చదువుతున్న ఆయాన్ అనే విద్యార్థిని విచక్షణ రహితంగా కొట్టడంతో వీపు, కడుపు భాగాల్లో గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకొని ప్రిన్సిపాల్ ఖాజామహబూబ్ఖాన్కు గురువారం ఫిర్యాదు చేశారు. ఆయన ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా వారు విచారణ నిర్వహించారు. అనంతరం వారి నివేదికను పరిశీలించిన అధికారులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి జహంగీర్‌ను తక్షణమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడిపై కుటుంబ సభ్యులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.