విపత్కర పరిస్థితుల్లోనూ వీరోచిత సేవలు
కరోనా వ్యాప్తి చెందకుండా నిరంతర శ్రమ
ప్రజారోగ్యమే ధ్యేయంగా.. పనే పరమావధిగా విధులు
ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తింపు
మహబూబ్‌నగర్‌టౌన్, మే 30 : కరోనా కారణంగా ఎవరినీ నమ్మలేని దుస్థితి. ఇంతటి విపత్క ర పరిస్థితిల్లో కోడి కూత కన్నా ముందే లేచి.. అర్థరాత్రి వరకు వైరస్‌కు ఎదురునిలుస్తూ నిర్విరామ సేవలందిస్తున్నారు సఫాయిలు. వీరు సిపాయిల కు ఏ మాత్రం తక్కువ కాదు. చెత్తాచెదారాన్ని డం పింగ్ యార్డుకు తరలిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ.. సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తూ వైరస్‌ను దరిచేరనివ్వకుండా చూస్తున్నారు. కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి కారణంగా బయటికి రావాలంటే భయపడుతున్న ఈ తరుణంలో.. కొ విడ్ సోకిన వ్యక్తుల ఇండ్ల ఆవరణాల్లోనూ ప్రాణా లు ఫణంగా పెట్టి పారిశుధ్య పనులు చేపడుతూ అందరి మన్ననలు చూరగొంటున్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ను అడ్డుకట్ట వేసేవారిలో పారిశుధ్య కార్మికులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్ పోరులో పల్లె, పట్టణం, నగరం.. ఎక్కడైనా సరే వారే ముందుం డి పనిచేస్తున్నారు. అర్ధరాత్రి సైతం రోడ్లు, వీధు లు, వైద్యశాలలను శుభ్రపరుస్తున్నారు. కరోనా భయంతో సొంత ఇంట్లో వాళ్లకు సేవ చేయలేని పరిస్థితుల్లో.. సఫాయి కార్మికులు మాత్రం అం దరి ఇండ్లలోని చెత్తను ప్రతిరోజూ తొలగిస్తున్నా రు. ప్రభుత్వం అందిస్తున్న అండదండలే వారికి ధైర్యం కల్పిస్తున్నాయి.
పారిశుధ్య పనుల్లో 600 మంది..
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో 49 వా ర్డులు ఉండగా.. ప్రతి రోజు పట్టణంలో 106 మె ట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నది. చెత్త తొలగింపు, పారిశుధ్య పనులు చేపట్టేందుకు 98 మం ది రెగ్యులర్, 337 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. 52 స్వచ్ఛ ఆటోలు అందుబాటులో ఉండగా.. ఒక్కో ఆటోకు ఇద్దరు చొప్పున 104 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 9 మున్సిపల్, 10 ప్రైవేట్ ట్రాక్టర్లు చెత్త తరలింపునకు వినియోగిస్తున్నారు. వీరిని పర్యవేక్షణ చేసేందుకు ఇ ద్దరు పారిశుధ్య విభాగం అధికారులతోపాటు ఒక హెల్త్ అసిస్టెంట్ ఉన్నారు.
ప్రజారోగ్యానికి కృషి..
కరోనా వంటి విపత్కర సమయంలో వైద్యుల తర్వాత అంతే ధైర్యంగా పనిచేసేది మున్సిపల్ కార్మికులే. తెల్లవారుజామునే వీధులు శుభ్రం చేస్తారు. ప్రజారోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తారు. కరోనా బాధితుల ఇండ్లకు వెళ్లి బ్లీచింగ్ పౌడర్ చల్లి, శానిటైజ్ చేస్తున్నారు. ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి చెత్తా చెదారాన్ని వీధుల్లో వేయొద్దు. ఇంటి వద్దకు వచ్చే చెత్త బండ్లలోనే వేయాలి. పారిశుధ్య సిబ్బందికి అందరూ సహకరించాలి.