ఈనెల 31 వరకు ఎర్లీబర్డ్ అవకాశం
ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ
మహబూబ్నగర్ టౌన్, మే 4 : మున్సిపాలిటీల్లో ముందుస్తు ఆస్తి పన్ను చెల్లించే వారికి మరో అవకాశం లభించింది. ఏప్రిల్ 30 వరకు ఉండే ఎర్లీబర్డ్ అవకాశాన్ని ప్రభుత్వం 31 వరకు పొడిగించింది. ఈలోపు చెల్లించే వారికి 5 శాతం రాయితీ దక్కనున్నది. మహబూబ్నగర్ జిల్లాలో 50 వేలకుపైగా ఇండ్ల యాజమానులు వినియోగించుకునే అవకాశం ఉన్నది. మున్సిపాలిటీల్లో 2020-21 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను ముందుస్తు వసూలుపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ పథకానికి ప్రతి ఏటా ఏప్రిల్ 30 వరకు మాత్రమే అవకాశం కల్పించారు. అయితే ఏడాదిన్నరగా దేశంలో కొవిడ్-19 ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు కల్పిస్తుంది. గతేడాదిలో రూ.10 వేల కంటే తక్కువ ఉన్న వారికి ప్రభుత్వ 50 శాతం మాఫీ చేసింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎర్లీబర్డ్ పథకం కింద చెల్లింపుల కోసం మరో నెల అవకాశం కల్పించింది. దీంతో మే 31లోగా పన్ను చెల్లించిన అందరికీ ఈ అవకాశం వర్తించనున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముందుస్తు పన్నుల చెల్లింపులపై రెండేళ్లుగా అన్ని మున్సిపాలిటీల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ వసూళ్లను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర మున్సిపల్ శాఖ అన్ని కమిషనర్లకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ముందుస్తు ఆస్తి పన్నుల (ఎర్లీబర్డ్) వసూళ్లపై అన్ని మున్సిపాలిటీలు దృష్టి సారిస్తున్నాయి, ఈ సారి మహబూబ్నగర్ మున్సిపాలిటీలో రూ.2.80 కోట్లకుపైగా ఏప్రిల్ చివరి నాటికి ముందుస్తు ఆస్తి పన్ను వసూలైంది. జడ్చర్ల మున్సిపాలిటీలో ఎన్నికల హడావుడి ఉండటంతో దాదాపు రూ.20 లక్షలు వసూలైంది. ఇక ఎన్నికలు పూర్తి కావటంతో మరో అవకాశం కల్పించడంతో మున్సిపల్ అధికారులు ఆస్తి పన్ను వసూలుపై దృష్టి సారించారు. కాగా మరో మున్సిపాలిటీ భూత్పూర్ మాత్రం గత గడువు ముగిసే నాటికి రూ.10 వేల ముందుస్తు పన్ను వసూలైంది. ఈనెలాఖరు వరకు అవకాశం ఉండటతంతో అధికారులు అవగాహన కల్పిస్తే మరింత వసూలయ్యే అవకాశం ఉన్నది.
మరో నెల అవకాశం
ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల చెల్లింపునకు సంబంధించి ఏటా ఏప్రిల్ 30తోనే గడువు ముగుస్తుంది. కానీఈ సారి కొవిడ్ నిబంధనల మేరకు ప్రభుత్వం ఈనెలాఖరు వరకు పొడిగించింది. దీంతో పన్ను వసూళ్లు పెరిగే అవకాశం ఉన్నదన్నారు. పట్టణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపాలిటీలో 50వేలకుపైగా మందికి లబ్ధిచేకూరే అవకాశం ఉన్నది. ఈనెల 31లోగా చెల్లించి 5 శాతం రాయితీ పొందవచ్చు.