నారాయణపేట : మక్తల్–నారాయణపేట–కోడంగల్ ఎత్తిపోతల పథకం బాధిత రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భూములు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని బాధితులు మండిపడ్డారు. భూ పరిహారంతో పాటు బోర్లు, పైప్లైన్లు, చెట్లు, పంట నష్టాలకు సంబంధించిన పరిహారం ఇప్పటికీ అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పలుమార్లు అధికారులకు వినతులు ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తూ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రాజెక్టు పేరుతో భూములు తీసుకున్న ప్రభుత్వం… రైతులకు న్యాయం చేయడంలో మాత్రం నిర్లక్ష్యం ఎందుకు చూపుతోందని ప్రశ్నించారు. పెండింగ్ పరిహారాన్ని వెంటనే విడుదల చేసి బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.