మాగనూరు, ఏప్రిల్ 19: మాగనూరు (Maganuru) కృష్ణ మండలాల్లో చిరిగిన గోనె సంచులతో రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం నేలపాలవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి మండల వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి అధికారులు రైతులకు చిరిగిన గోనె సంచులను పంపిణీ చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. చినిగిన బ్యాగులు వస్తే తామేం చేయాలని, ఇష్టముంటే తీసుకెళ్లండి లేకపోతే లేదని తెగేసి చెప్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాగనూరు మండలం వర్క్ గ్రామానికి చెందిన కోరిబేని మారెప్ప దాదాపు 1400 గన్ని బ్యాగులు తీసుకెళ్లగా ఒక్కటంటే ఒక్కటి కూడా సక్రమంగా లేదని, వాటిని తామే కుట్టుకున్నామని చెప్పారు. అయితే అన్ని బస్తాలను కుట్టలేక గడ్డిని రంద్రాల్లో పెట్టి ఒడ్లు కారకుండా కాపాడుకున్నామన్నారు. రైస్ మిల్లుల వరకు తీసుకెళ్లేలోపు ధాన్యం నేలపాలవుతుందని వెల్లడించారు. ఇలా చిరిగిన బస్తాలు ఇచ్చి అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా చిరిగిన బస్తాలు కాకుండా కొత్తవి సప్లయ్ చేయాలని రైతులు కోరుతున్నారు.