మక్తల్, ఫిబ్రవరి 8 : నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మా భూములు ఇవ్వమని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి రైతులు తెగేసి చెప్పారు. శనివారం నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భా గంగా అధికారులు మక్తల్ మండలం కాట్రేవుపల్లి లో భూముల సర్వే చేపట్టడానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆ గ్రామ రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్న మా లాంటి రైతులు భూములు ప్ర భుత్వం లాక్కోవాలని చూస్తే ఎలా అని అధికారులను నిలదీశారు.
ప్రభుత్వం జీవో నెంబర్ 69 పేరుమీద మక్తల్ మండలం భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ఏడు టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా, భూములను రైతుల నుంచి తీసుకొని పైపులైన్ ద్వారా నీటిని తరలించే ప్రక్రియ పనులను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో కాట్రేపల్లి గ్రామంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎలాంటి సమాచారం అందించకుండా ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూ సర్వేను చేయడానికి అధికారులు వచ్చారు.
విషయం తెలుసుకున్న గ్రామ రైతులు మూకుమ్మడిగా సర్వే పనుల వద్దకు చేరుకొని భూములు ఇచ్చేది లేదని, సర్వే చేయవద్దని, అయినా ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజు అనే రైతు తనకున్న 24 ఎకరాలు మొత్తం నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూమి పోతే ఎలా జీవించాలని అ ధికారులను నిలదీశారు. మిగతా రైతులు కూడా మా భూములు ఇవ్వమని సర్వే పనులను అడ్డుకోవడంతో మక్తల్ తాసీల్దార్ సతీశ్‌కుమార్ ఆర్డీవో రామచంద్రతో ఫోన్లో మాట్లాడి రైతులను ఒప్పిం చే ప్రయత్నం చేసినప్పటికీ రైతులెవ్వరు సర్వేకు ఒప్పుకోలేదు. అధికారులు చేసేది లేక గ్రామం నుంచి వెనుదిరిగారు.