నారాయణపేట టౌన్, నవంబర్ 18: బాలలందరూ బడికి వెళ్లి చదువుకోవాలని, ఉన్నత విద్యను అభ్యసించి ఇతరులకు ఆదర్శంగా నిలువాలని కలెక్టర్ హరిచందన సూచించారు. బాలల వారోత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి క్రీడా మైదానం వరకు నిర్వహించిన మారథాన్వాక్ను జెండా ఊపి ప్రారంభించారు. క్రీడా మైదానంలో డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ బాలలందరూ ఒక్కటేనని, అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడాలు లేవని, ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు. బాలలందరూ వారి నైపుణ్యాల మేరకు కష్టపడి చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి కుసుమలత, విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది, బాలల పరిరక్షణ విభాగం అధికారులు, పీఈటీలు పాల్గొన్నారు.