AI Teaching | మహబూబ్ నగర్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో బోధన విద్యార్థులకు వరంగా మారనున్నదని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ పేర్కొన్నారు. జిల్లాలో ఏఐ బోధనకు పది పాఠశాలలను పైలట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పాఠశాలల్లో 114 మంది విద్యార్థులకు ఏఐ ఆధారిత విద్యాబోధన చేస్తారు. ఇందుకోసం ఆయా పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ఏఎక్స్ఎల్ కంప్యూటర్ ల్యాబ్‌లను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఈ ల్యాబ్‌ను సిక్త పట్నాయక్ ప్రారంభిస్తూ విద్యార్థుల అభ్యాసన మరింత ఆకర్షణీయంగా, ఇంటరాక్టివ్‌గా నిర్వహించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెరుగ్గా సహకరిస్తుందన్నారు. దీంతో విద్యార్థుల స్థాయిని అంచనా వేస్తూ.. అందుకు తగినట్లు అభ్యాస కృత్యాలు జనరేట్ చేయడంతో విద్యాభ్యాసం పట్ల పిల్లలో మరింత ఉత్సుకత పెంచేలా బోధన చేయొచ్చునన్నారు.
విద్యార్థుల కంప్యూటర్ ల్యాబ్‌లో సిక్త పట్నాక్ ముచ్చటిస్తూ చిన్నారుల ఉత్సాహమే ప్రేరణగా ఏఐ ఆధారిత విద్యాబోధనను జిల్లాలో ప్రారంభించామన్నారు. కనుక పిల్లలు నిరంతరంగా ప్రతిరోజు కంప్యూటర్ ల్యాబ్‌ను వినియోగించాలని అన్నారు. ఎంపిక చేసిన పది పాఠశాలల్లో మూడవ, నాల్గవ, ఐదో తరగతి విద్యార్థులకు రెండు రోజులు 45 నిమిషాలు ఏఐలో విద్యాబోధన జరుగుతుందన్నారు. ఈ విద్యాబోధనకు ఎంపికైన ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తయ్యిందన్నారు. ప్రతి పాఠశాలకు జిల్లా కలెక్టరేట్ సౌజన్యంతో నాలుగు కంప్యూటర్లు అందజేశారు. జిల్లాలో మూడు మాల్, గుడెబలుర్, కర్ని,శివాజీ నగర్, నారాయణపేట, కొల్లంపల్లి – కంసాన్పల్లి, పల్లెర్ల, నిడిజింత, గుండు మాల్, నాచారం పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏఐ ఆధారిత విద్యా బోధనలో ఉపాధ్యాయుల తీరును సంబంధిత ఎంఈవోలు పర్యవేక్షిస్తూ కార్యక్రమాన్ని రోజువారీగా సమీక్షిస్తారన్నారు.
ఏఐ ఆధారిత విద్యాబోధనకు అవసరమైన కంప్యూటర్లను పాఠశాలలకు పంపిణీ చేశామని సిక్త పట్నాయక్ చెప్పారు. స్కూల్ గ్రాంట్ నుంచే ఇంటర్నెట్ కనెక్షన్ పొందాలన్నారు. ఈ అవకాశాన్ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మెరుగ్గా వినియోగించుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, ప్రధానోపాధ్యాయులు బాలరాం నాయక్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.