నారాయణపేట, నవంబర్ 4 : నారాయణపేట నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో, అనంతరం నారాయణపేట జిల్లా ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి చేపట్టడంతో రూపురేఖలు మారిపోయాయి. ఊహించని రీతిలో జరిగిన పనులపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉన్నాయి. గతంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఆయా మండలాల్లో కనీవిని ఎరుగని రీతిలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేయడంతో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న నారాయణపేట నేడు ఆదర్శంగా నిలుస్తున్నది.
నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేపట్టారు. స్వరాష్ట్రం ఏర్పడడం, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి కృషితో జిల్లా కావడంతో ప్రజలకు పరిపాలన చేరువై, అభివృద్ధికి కూడా ఎంతో దోహదపడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ తర్వాత ఏర్పడిన తొలి మున్సిపాలిటీగా నారాయణపేటకు పేరు ఉన్నప్పటికీ, గతంలో ఎవరూ అభివృద్ధి చేయలేదు. ఫలితంగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పేట ఆ తర్వాత ఎవరూ గుర్తుపట్టని పరిస్థితికి వచ్చింది. కానీ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడంతో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గడిచిన తొమ్మిదిన్నరేండ్ల కాలంలో నారాయణపేట మున్సిపాలిటీలో రూ.596కోట్ల 69లక్షలతో అభివృద్ధి, సంక్షేమ పనులు చేపట్టారు. సత్యానారాయణ చౌరస్తా నుంచి సుభాష్‌రోడ్, భీమండి కాలనీ నుంచి ఎర్రగుట్ట వరకు ఇరుకైన రోడ్ల కారణంగా ప్రతినిత్యం ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన నారాయణపేట ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా రోడ్ల విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తూ రూ.28 కోట్ల 50లక్షల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. అంతేకాకుండా 80 ఫీట్ల రోడ్డు, మధ్యలో డివైడర్లు, పూల చెట్లు, బట్టర్ ఫ్లై లైట్లతో సుందరమైన రోడ్డును నిర్మించారు. రూ.3 కోట్ల 65లక్షలతోఅంబేద్కర్ చౌరస్తా నుంచి వీరసావర్కర్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. రూ.50లక్షలతో అటవీ శాఖ క్వార్టర్స్ నిర్మించారు. నారాయణపేట మండలం ఏక్లాస్‌పూర్‌లో 200 ఎకరాల్లో రూ.3కోట్ల వ్యయంతో ఎకోపార్క్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి.
రూ.2కోట్ల 5లక్షలతో ఈద్గా నిర్మాణ పనులు చేపడుతున్నారు. రూ.90లక్షలతో వెజ్ – నాన్‌వెజ్ మార్కెట్ నిర్మించారు. రూ.కోటీ 85లక్షలతో ఫిష్ మార్కెట్ నిర్మించి ఉపయోగంలోకి తీసుకొచ్చారు. రూ.2కోట్లతో జిల్లా గ్రంథాలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఒక్క నారాయణపేట మున్సిపాల్టీలోనే రూ.33 కోట్లతో మిషన్ భగీరథ పనులు, రూ. 20కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, రూ.2కోట్లతో ఎనిమిది మహిళా సంఘాల భవనాల నిర్మాణాలు చేపట్టారు. ఎస్సీ వాడలో కమ్యూనిటీ హాల్, రైతు బజార్ నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరీ అయ్యాయి. రూ.కోటీ 30లక్షల వ్యయంతో సైన్స్ పార్క్, రూ.85లక్షలతో సీనియర్ సిటిజన్ పార్క్ నిర్మించారు. తాజాగా బీసీ కాలనీ సమీపంలో రూ.2కోట్లతో మరో పార్క్‌ను నిర్మిస్తున్నారు. వీటితో పాటు సఖి సెంటర్, వృద్ధాశ్రమం, అనాథశ్రమం నిర్మించారు. రూ.4కోట్ల వ్యయంతో కొండారెడ్డిపల్లి చెరువును మినీట్యాంక్‌బండ్‌గా నిర్మించి ఆహ్లాదకరమైన పార్క్‌ను, పిక్నిక్ స్పాట్‌గా తీర్చిదిద్దారు. అదేవిధంగా మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి రూ.4కోట్ల నిధులు మంజూరీ అయ్యాయి. నారాయణపేట జిల్లాకు జిల్లా దవాఖానను మంజూరీ చేయించి నారాయణపేట మండలం అప్పంపల్లి సమీపంలో రూ.56కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నారాయణపేట మండలం సింగారం సమీపంలో జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి రూ.52 కోట్లు, ఎస్పీ కార్యాలయానికి రూ.36 కోట్లు, మిషనరీ మెకజ్నైడ్ ల్యాండ్రీ ఏర్పాటుకు రూ.2కోట్లతో పనులు జరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రైతన్నలు పండించిన ధాన్యం అమ్మాలంటే అపసోపాలుపడేటోళ్లు. బస్టాండ్ పక్కన ఉన్న తక్కువ స్థలంలో రైతులు తెచ్చిన ధాన్యం సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. వర్షం వచ్చిందంటే ధాన్యమంతా నీటిపాలయ్యేది. దీంతో దళారులు తడిసిన ధాన్యాన్ని కొనడానికి ముందుకురాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు.
స్వరాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల ఇబ్బందులను గమనించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతుల కోసం జిల్లా కేంద్రం సమీపంలో విశాలమైన స్థలంలో అన్ని వసతులతో మార్కెట్‌ను నిర్మించారు. దీంతో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని దర్జాగా అమ్ముకుంటున్నారు.