New Year Celebrations | కొల్లాపూర్: నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న సోమశిల కొత్త సంవత్సరం వేడుకలకు సిద్ధమైంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు భారీగా యువత తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో అదే స్థాయిలో వారికి తగ్గట్లుగా మద్యం నిల్వ చేసినట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ పర్యాటక శాఖకు చెందిన కాటేజీలను లీజుకు తీసుకున్న మృగవాని సంస్థ కూడా బుధవారం రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్ష్ కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా 31st నైట్‌కు అక్కడ ఉండేలా మృగవాని రిసార్ట్స్ ఏర్పాట్లను చేసి, అడ్వాన్స్డ్ బుకింగ్ కూడా ఓపెన్ చేసింది. మృగవాని కాటేజీలలో రూ. 33,999, రూ. 23,999 లుగా రూముల ధరలను నిర్ణయించారు. అంతేకాదు రూములోకి ఒక ఎక్స్ట్రా పర్సన్ వస్తే రూ.7,999 చెల్లించాల్సిందే అని షరతు పెట్టింది. ఇక మృగవాని కాటేజీలోకి లిక్కర్ సైతం తీసుకొని వెళ్లేందుకు అనుమతులు ఇస్తున్నట్లు తెలుస్తుంది. అంత ధర చెల్లించి రూమ్ లో బస చేసేవారు అదే స్థాయిలో లిక్కర్‌ను సైతం ఏరులై పారించే అవకాశం లేకపోలేదని చర్చ నడుస్తున్నది.
రెండు రాష్ట్రాలను కలిపే నల్లమల అడవి ప్రాంతంతో పాటు కృష్ణా నది ప్రవహించే నది ఒడ్డున ఈ ప్రాంతంలో గతంలో ఎక్సైజ్ శాఖ గంజాయిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినది. గంజాయి ఆనవాళ్లు కూడా ఈ ప్రాంతంలో దొరికినట్లు గతంలో నమోదైన కేసుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే నిషేధిత మత్తుపదార్థాలకు యువత బానిసలుగా మారి చెడిపోతున్నారని ప్రజా సంఘాల నాయకుల ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో జరుగుతున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్ వేడుకలలో గంజాయితోపాటు మితిమీరిన మద్యం, అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నందున ఆధ్యాత్మిక శోభతో మిళితమైన పర్యాటక వాతావరణం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావుకు కొల్లాపూర్ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.