కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) నియోజకవర్గంలో జర్నలిస్టుల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు జర్నలిస్టులను వేటాడి అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరికొందరి కోసం గాలిస్తున్నారు. జర్నలిస్టులను దేశద్రోహుల వలె ఇళ్లలో నిద్రిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడాన్ని ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇళ్ల స్థలాల కోసం శాంతియుతంగా దీక్షలు చేస్తున్న జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేసే పనిలో భాగంగా నియోజవర్గంలోని నమస్తే తెలంగాణ రిపోర్టర్లు అందరిని టార్గెట్ చేసి అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను ఎత్తిచూపుతున్న నమస్తే తెలంగాణ కొల్లాపూర్ ఆర్సీ ఇన్చార్జ్ సీపీ నాయుడు, పెంట్లవెల్లి మండల నమస్తే తెలంగాణ రిపోర్టర్ రమణోజిరావు, నమస్తే తెలంగాణ కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ స్వామిని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
అలాగే పెద్ద కొత్తపల్లి మండల నమస్తే తెలంగాణ రిపోర్టర్ సందు శ్రీనివాసులు, కోడేరు మండల నమస్తే తెలంగాణ రిపోర్టర్ లాలయ్య కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ప్రజల పక్షాన వున్న నమస్తే తెలంగాణ దినపత్రికను చూసి ప్రభుత్వం భయపడుతుందని, అందుకే పత్రికా స్వేచ్ఛను సంకెళ్లతో బంధించేందుకు ప్రయత్నం చేస్తుందన్నదని పలువురు విమర్శిస్తున్నారు. పెద్దకొత్తపల్లి మండలం నమస్తే తెలంగాణ రిపోర్టర్ సందు శ్రీనివాసులు గత రెండు రోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా అరెస్టు చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమైన చర్య అని కొల్లాపూర్ సీనియర్ రిపోర్టర్లు బచలకూర కురుమయ్య జలకం మద్దిలేటిలు విమర్శించారు.