Kollapur | కొల్లాపూర్ : ఈదమ్మ తల్లి అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ట వేడుకలు కొల్లాపూర్లో ఘనంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శుక్రవారం ఉదయం 9.53 గంటలకు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతిష్టాపన అనంతరం పలు కార్యక్రమాలు నిర్వహించి.. భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో పోతురాజుల విగ్రహాలను ప్రతిష్టించారు. శృంగేరి శక్తి పీఠం వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన హోమం, మహాకుంభాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు జరగ్గా.. ఆలయ పునర్నిర్మాణ దాత మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా గత మూడు రోజుల నుంచి కొల్లాపూర్ పట్టణంతో పాటు సమీప గ్రామాల్లో పండుగ శోభను సంతరించుకున్నాయి.
ఇండ్ల మామిడి తోరణాలు, ముగ్గులతో అలంకరించారు. ఆడపడుచులు అమ్మవారికి నవధాన్యాలతో పాటు నైవేద్యం తీసుకొని వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఇంటి ఆడపడుచులు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పుట్టింటి నుంచి ఒడిబియ్యం నూతన వస్త్రాలను అందుకున్నారు. శుక్రవారం విగ్రహ ప్రతిష్టానంతరం మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈదమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత భక్తిశ్రద్ధలతో సొంత నిధులు ఖర్చు చేసి ఆలయ పునర్నిర్మాణం చేసిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి దంపతులను అభినందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.