అమరచింత,మార్చ్ 28 : అమరచింత మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తాగునీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ అధికారులు మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీపీఎం ఆధ్వర్యంలో మిషన్ భగీరథ సీఈ కొల్లు వెంకటరమణకు వినతిపత్రం అందజేసినట్లు సీపీఎం మండల కార్యదర్శి జీఎస్ గోపి, సభ్యులు రమేష్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ గతపక్షం రోజులుగా సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలోని 10 వార్డులలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల సమస్యల్ని తెలుసుకున్నామన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు మంచినీటి సమస్యతో పాటు డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు రోడ్డుపైకి చేరి ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా అందించే తాగునీరు రామన్‌పాడు, ఎర్రగడ్డ నుంచి నేరుగా అమరచింత కాకుండా ఆత్మకూర్, ఖానాపూర్, సీయంపేట గ్రామాలకు వదులుతుండడంతో చివరగా ఉన్న అమరచింతకు మంచినీరు తక్కువగా వస్తుందన్నారు. వెంటనే అధికారులు సమస్యను పరిష్కరించాలన్నారు.