అమరచింత, ఏప్రిల్ 07: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు రేషన్ కార్డులపై అందిస్తున్న సన్న బియ్యం (Fine Rice) పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటే ఎక్కువగా ఉందని కృష్ణంపల్లి మాజీ ఉపసర్పంచ్ మల్లారెడ్డి పేర్కొన్నారు. సోమవారం వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని కృష్ణం పల్లి గ్రామంలో సన్న బియ్యం పథకం ప్రారంభించి మాట్లాడుతూ.. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందన్నారు. రేషన్ కార్డుల ద్వారా ఇచ్చే సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటా అధికంగా ఉన్న మాట మరచి, ఎన్నికల హామీల్లో లేని సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన మహిళలకు రూ.2500, విద్యార్థులకు స్కూటీలు, వృద్ధులు, వికలాంగులకు, వివిధ వర్గాలకు నెలనెలా అందిస్తున్న ఆసరా పెన్షన్లను రూ.4 వేలు, రూ.6 వేలకు పెంచి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుర్వ హరీశ్, కురుమన్న, వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.