తిమ్మాజీపేట,మే 13 : తిమ్మాజిపేట మండల కేంద్రంతో పాటు గొరిట గ్రామంలో ఫర్టిలైజర్ దుకాణాలను నాగర్ కర్నూల్ ఏడిఏ పి.పూర్ణచందర్ రెడ్డి మంగళవారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో స్టాక్‌ను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. దుకాణాల లైసెన్సును పరిశీలించారు. ఎరువుల వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేశారు. ఎరువులను పీఓఎస్ మిషన్ ద్వారానే విక్రయించాలని, రైతుల వివరాలు పూర్తిగా నమోదు చేయాలన్నారు.
రైతులు ఆధార్ కార్డు తీసుకున్న తర్వాతే ఎరువులు విక్రయించాలని, ప్రతి రైతుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ఆయన దుకాణ యజమానులకు స్పష్టం చేశారు. ఎలాంటి అక్రమాలు జరిగినా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి కమల్ కుమార్, ఏఈవోలు ఉన్నారు.