అచ్చంపేట: నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట (Achampet) మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 11 తర్వాత ఆయన బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. శుక్రవారం ఉదయం కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై చర్చినట్లు తెలుస్తున్నది.
కాగా, అచ్చంపేటలో గువ్వల బాలరాజుపై ఆయన మద్దతుదారులు తిరుగుబాటు ప్రకటించారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రధాన నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా ఆయనతో బీజేపీలోకి వెళ్లొద్దని తీర్మానించిన విషయం తెలిసిందే. నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాకుండా కూడా కేసీఆర్ భిక్షతో రాజకీయ అరంగేట్రం చేసిన గువ్వల పార్టీకి ద్రోహం చేసే చర్యలపై తీవ్రంగా ఖండించారు. మేమంతా కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోనే ఉంటామని.. పార్టీని వీడిపోమని ప్రతిజ్ఞ చేశారు.
మరోవైపు అచ్చంపేటలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నది. ఈ కార్యమానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇప్పటికే అచ్చంపేటలో ముఖ్యనేతల సమావేశం నిర్వహించిన నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.. ఎక్కడైనా నియోజకవర్గ ముఖ్య నేత పార్టీ మారితే.. ఆయన వెంట ఎంతో కొంత క్యాడర్ పోతుంది.. కానీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ మారినా చరిత్రలో మొదటిసారి క్యాడర్ ఎవరూ బీఆర్ఎస్ను వీడలేదు. మీకు నిజంగా హ్యాట్సాఫ్.. బీఆర్ఎస్ పార్టీపై మీకు నిజమైన నిబద్ధత ఉన్నది అని చెప్పారు.