ఇండ్లు రాని వారు నిరాశ చెందొద్దు.. మళ్లీ ఇస్తాం
త్వరలో మరిన్ని మంజూరు చేసేందుకు కృషి
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి
బండమీదిపల్లిలో 24 ‘డబుల్’ ఇండ్లు ప్రారంభం
జడ్చర్ల టౌన్, ఫిబ్రవరి 19 : అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. మండలంలోని బండమీదిపల్లి గ్రామ శివారులో రూ.1.25 కోట్లతో నిర్మించిన 24 డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఇండ్ల ఆవరణలో మొక్కలు నాటారు. ఒక్కొక్కటిగా డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులతో ముచ్చటించారు. అనంతరం జరిగిన స మావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంతోషమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగు లు వేస్తున్నట్లు చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇండ్లు రాని వారు నిరాశ చెందొద్దని, త్వరలో మరిన్ని మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు జంగయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్, డిప్యూటీ తాసిల్దార్ వెంకటేశ్వరి, సర్పంచులు, కౌన్సిలర్లు, హౌ సింగ్ శాఖాధికారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి చేరికలు..
బాలానగర్, ఫిబ్రవరి 19 : సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు వస్తున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. మండలంలోని కాంగ్రెస్కు చెందిన నందారం సర్పంచ్ నిర్మల, పలువురు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో శనివారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులమతాల పేరిట రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే పార్టీలను ప్రజలు దరి చేరనీయడం లేదన్నారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ నిర్మల తెలిపారు. అంతకుముందు గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, స్మశాన వాటిక, నందారం నుంచి బాలానగర్ వరకు నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు.