నిజామాబాద్, ఫిబ్రవరి 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి జిల్లా పురపాలక పాలనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అంతటా మహిళా మణులే సారథ్యం వహించే అవకాశం లభించింది. ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్‌ను మినహాయిస్తే ఏడు చోట్ల స్త్రీ మూర్తులకే అవకాశం దక్కింది. ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీలు మినహాయిస్తే మున్సిపల్ వైస్ చైర్పర్సన్లుగా ఆరు చోట్ల స్త్రీలకే అవకాశం దక్కింది. నిజామాబాద్ నగరపాలక సంస్థకు మేయర్, డిప్యూటీ మేయర్‌గా మహిళలే బాధ్యతలు చేపట్టారు. భీంగల్, కామారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లుగా రెండు పోస్టుల్లోనూ మహిళలే నిలిచారు.
ఉభయ జిల్లాల్లో పురపాలక సంఘాలకు సారథులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎక్కువ మంది స్త్రీ మూర్తులే ఉండటంతో అంతటా చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అపురూపమైన అవకాశం మహిళలకు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్ లేకపోయినప్పటికీ ఆరు చోట్ల అనూహ్యంగా మహిళలు అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. సామాజిక సమీకరణలు, ఆయా పార్టీల్లో కౌన్సిలర్‌గా విజయం సాధించడం, రాజకీయ నేపథ్యం వంటి కారణాలు కలిసి వచ్చాయి.
మేయర్ పదవి విషయంలో తీవ్ర నాటకీయత
నిజామాబాద్ నగరపాలక సంస్థకు మేయర్ పదవి విషయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి పూటకొక పేరు బయట ప్రచారం జరిగినప్పటికీ జనరల్ మహిళకు మేయర్ స్థానం కేటాయించడంతో పరిమితంగానే పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో చేతి గుర్తుతో విజయం సాధించిన మహిళల్లో ఎవరికో ఒకరికి మేయర్ సీటు ఖాయమైంది. ఇందులో మైనార్టీ వర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్లు ఉండటంతో మేయర్ స్థానం కోసం తీవ్రంగా పోటీ పడ్డారు.
కాంగ్రెస్ పార్టీ కాస్తా ఎంఐఎంతో జత కట్టడంతో కాంగ్రెస్ పార్టీలోని ముస్లీం మహిళా కార్పొరేటర్లకు అనూహ్యంగా అవకాశం చేజారింది. ఎంఐఎం పార్టీ నుంచి డిప్యూటీ మేయర్‌గా అదే వర్గానికి చెందిన వారు పోటీలో నిలవడంతో హస్తం పార్టీ బీసీ వర్గానికి చెందిన మహిళకు అవకాశం కల్పించింది. ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీలోని మైనార్టీ వర్గాలు తీవ్ర అసంతృప్తికి గురైనట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌లో మేయర్ అభ్యర్థిత్వంతో 19వ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి చెందడంతో… మహిళా కార్పొరేటర్లుగా గెలిచిన మున్నూరు కాపు, గౌడ సామాజిక వర్గాలకు చెందిన వారు ప్రయత్నించి విఫలమయ్యారు.

Ni