Achampet | అచ్చంపేట : సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కేవీ స్వరాజ్య లక్ష్మి సూచించారు. ఈ మేరకు మంగళవారం అచ్చంపేటలోని ఓ ప్రయివేటు సమావేశ మందిరంలో క్షేత్ర స్థాయి సిబ్బందికి సీజనల్ వ్యాధుల నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో స్వరాజ్య లక్ష్మి మాట్లాడుతూ.. గతంలో డెంగ్యూ, మలేరియా, నీళ్ల విరేచనాలు, జ్వరాలు నమోదైన గ్రామ, పట్టణ ప్రాంతాల్లో అంటు వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. దోమ కాటు వ్యాధులైన డెంగ్యూ, మలేరియా , చికున్ గున్యా రాకుండా ప్రతి శుక్రవారం పొడి దినం(డ్రై డే) పాటించాలని, దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలకు తలుపులకు ఇనుప జాలీలను బిగించుకోవాలని, దోమతెరలు వాడాలని, ఇంటి ఆవరణలో, పరిసరాలలో నీరు నిలవకుండా చేసుకోవాలని, పాత టైర్లు, పనికిరాని ప్లాస్టిక్, గాజు సీసాలు, డిస్పోజబుల్ కప్పులు, కొబ్బరి చిప్పలు తమ ఇంటి ఆవరణలో లేకుండా చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, అనుమానం ఉన్న వారి రక్త నమూనాలను టి-డయాగ్నొస్టిక్ హబ్‌కు పంపాలని తెలియజేశారు. కలుషితమైన నీరు ఆహారం ద్వారా వ్యాపించే టైఫాయిడ్, డయేరియా తదితర వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని, ముఖ్యంగా పరిశుభ్రమైన త్రాగునీరు, చేతుల పరిశుభ్రత , పరిసరాల పారిశుధ్యం గురించి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కలిగించాలని తెలియజేశారు. గాలి ద్వారా వ్యాపించే స్వైన్ ఫ్లూ, కోవిడ్- 19 నివారణ గురించి ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. జూన్ 16వ నుండి జులై 31 వరకు నిర్వహించబోతున్న “నీళ్ల విరేచనాలను ఆపండి” కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల ఇంటికి వెళ్లి ముందస్తు జాగ్రత్తగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయాలని, డయేరియా కలిగిన పిల్లలకు జింక్ మాత్రలు, ఓఆర్ఎస్ పాకెట్లు ఇవ్వాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట డివిజన్ ఉప జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తారా సింగ్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రవి కుమార్, పీహెచ్సీ వైద్యాధికారులు, ఎఎంఒఆర్ శ్రీనివాసులు, అచ్చంపేట డివిజన్ ఉప మలేరియా అధికారి బికులాల్, ఏపీవో రాజేష్ వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎంల్హెచ్పీలు, పర్యవేక్షణ సిబ్బంది, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.