జడ్చర్ల టౌన్, మార్చి 22 : జడ్చర్లలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ సంస్థ ఏ-గ్రేడ్ ఇచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పియ చిన్నమ్మ తెలిపారు. గతేడాది మార్చిలో న్యాక్ బృందం కళాశాలలో పర్యటించి 2.82 సీజీపీఏతో బీప్లస్ గ్రేడ్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు మరోసారి న్యాక్ సంస్థకు అప్పీల్ చేశారు. ఇందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 21, 22 తేదీల్లో న్యాక్ బృందం కళాశాలలో పర్యటించింది. విద్యాబోధనలు, సదుపాయాలను గుర్తించిన న్యాక్ బృందం కళాశాలకు 3.24 స్కోర్‌తో ఏ గ్రేడ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోనే ‘ఏ’ గ్రేడ్ సాధించిన మొట్టమొదటి కళాశాలగా జడ్చర్ల డిగ్రీ కళాశాల చరిత్ర సృష్టించింది.
కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా 10ఏండ్ల వరకు ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు. రాష్ట్రంలో ఏడు కళాశాలలకు ఇప్పటి వరకు ‘ఏ’ గ్రేడ్ సాధించగా, ఎనిమిదో కళాశాలగా జడ్చర్ల కళాశాల నిలువడం సంతోషంగా ఉందన్నారు. బొటానికల్ గార్డెన్, బయోడైవర్సిటీ రిసెర్చ్ సెంటర్, అంతర్జాతీయ గుర్తింపు పొందిన రాష్ట్ర హెర్బేరియం, 25 అంశాలపై రిసెర్చ్ చేసిన 8 పుస్తకాలను ప్రచురించడం, 30కేవీ సోలార్ ఎనర్జీ సిస్టమ్, వివిధ విభాగాల్లో అధ్యాపకులు, విద్యార్థులు అవార్డులు దక్కించుకోవటంతోపాటు కళాశాలలో క్రమశిక్షణతో విద్యబోదనలు అందించడం వంటి అంశాలపై న్యాక్ సంస్థ ‘ఏ’గ్రేడ్ ఇచ్చిందని వెల్లడించారు. ఈ సందర్భంగా శుక్రవారం కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి నృత్యాలు చేస్తూ సం బురాలు జరుపుకొన్నారు.