బిజినేపల్లి, జనవరి 27: విద్యానిలయంగా నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామం ఎంతో ప్రఖ్యాతిగాంచింది. రాష్ట్రంలోనే ఏ గ్రామంలో విద్యాసంస్థని నెలకొల్పని సమయంలో 1963 నుండే ఇక్కడ ఎన్నో విద్యాసంస్థలు పాలెం గ్రామ నిర్మాత అయిన తోటపల్లి సుబ్రమణ్యం శర్మ ఏర్పాటు ఏసి ఈ ప్రాంత ప్రజలకు చదువును అందిస్తున్నారు. కాగా 60 ఏండ్లు పూర్తి చేసుకున్న తరుణంలో నేడు వజ్రోత్సవాల సందర్భంగా 1963 నుంచి 2023 మధ్యకాలంలో పాలంలోని పలువిద్యాసంస్థల్లో విద్యనభ్యసించిన పూర్వవిద్యార్థుల సమ్మేళనాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. వేడుకలకు సంబంధించి పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చిన్న కుగ్రామంగా ఉన్న పాలెం గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి ప్రపంచానికే చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిగా సుబ్బయ్య గుర్తింపు తెచ్చుకున్నారు. 23.04.1926లో తోటపల్లి సుబ్రమణ్యశర్మ జన్మించి 23.06.1986లో స్వర్గస్తులయ్యారు. గ్రామంలో 1928లో చిన్న పాఠశాలను ప్రారంభించారు. 1958లో 5వ తరగతి, 1959లో 6వ తరగతి, 1960లో 7వ తరగతి, 1961లో 8, 9 తరగతులు ప్రారంభించారు. అనంతరం 1962లో హెచ్ఎస్సీ, సీయూసీ ఏర్పాటు చేశారు. వీటితోపాటు 5.9.1962లో సైన్స్ కళాశాలకు శంకుస్థాపన చేయగా, 1963లో మొదటి సంవత్సరం విద్యను కళాశాలలో ప్రారంభించారు. 1964, 1965లో రెండు, మూడో సంవత్సరం కళాశాలలో బోధన ప్రారంభించారు. వీటితోపాటు 1964లో ఇక్కడ ఓరియంటల్(తెలుగు) కళాశాలను ఏర్పాటు చేశారు.
ఇక్కడ చదివిన వారు ప్రపంచ వ్యాప్తంగా వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. ఇక్కడ విద్యాసంస్థ నెలకొల్పి వేలమంది విద్యార్థులకు పాలెం గ్రామ నిర్మాత సుబ్బయ్య మార్గదర్శకంగా నిలిచారు. నాటినుంచి నేటి వరకు ఆయన ఆశయసాధనకోసం గ్రామ పూర్వ విద్యార్థులు కృషి చేస్తున్నారు. గ్రామంలోని విద్యాసంస్థలు నెలకొల్పి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలు నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు చేశారు.