ఊట్కూర్ : దేశంలో ముస్లిం మైనార్టీలను అణగ తొక్కేందుకే కేంద్రం వక్ఫ్ బిల్లును ( Waqf Bill ) ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిందని ముస్లిం సంఘాల నాయకులు, మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం మండల కేంద్రంలో ముస్లింలు భారీ ర్యాలీ( Rally) నిర్వహించి తహసీల్దార్ చింత రవికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఫ్లకార్డులను ప్రదర్శించి మోదీ ( Narendra Modi ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశంలోని పౌర సమాజానికి సమాన హక్కులు కల్పించిందన్నారు. దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీల ఆస్తులకు రక్షణగా ఉన్న భూముల ఆస్తులన్నింటినీ 8.72 లక్షలు గుర్తించి ప్రత్యేక వక్ఫ్ చట్టాన్ని రాజ్యాంగం అమలు చేసిందని గుర్తు చేశారు.
మోదీ ప్రభుత్వం ముస్లింలను అణగదొక్కేందుకు అనేక రకాల చట్టాలను అమల్లోకి తెచ్చి ప్రజాస్వామ్యాన్ని, స్వతంత్రతను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు ఆస్తులను కట్టబెట్టడమే కేంద్రం లక్ష్యంగా చర్యలు చేపట్టిందని ఆరోపించారు. పార్లమెంటులో అమలు చేసిన బిల్లును బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో అబ్దుల్ ఖయ్యూం, మండల అధ్యక్షులు మన్సూర్ అలీ, ఎంఐఎం నగర అధ్యక్షుడు మహ్మద్ ఇస్మాయిల్, న్యూ డెమోక్రసీ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి సలీం, వివిధ మసీదుల కమిటీ ప్రతినిధులు ఖాజీమ్ హుస్సేన్, అబ్దుల్ ఖాలిక్ మహమ్మద్ కుర్షీద్, ఒబేదుర్ రహిమాన్, మక్బూల్, మక్తల్ ఇబ్రహీం, అబ్దుల్ ఖాలిక్, సైఫుల్లఖాన్, అబ్దుల్ రషీద్ , నవాజుల హక్ , జమీర్ అలీ ముజీమి, రహీం, జావిద్ పాల్గొన్నారు.