మాగనూరు, మార్చి 28: వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగం గ్రామంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు నేతృత్వంలో మైనారిటీ సంఘాలు శాంతియుత ర్యాలీ, నిరసనలు తెలిపాయి. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. మైనారిటీల హక్కులకు ముప్పుగా భావించే వక్ఫ్ బోర్డు బిల్లుకు ప్రతిపాదిత సవరణలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నామని తెలిపారు. ఈ సవరణలు ముస్లింలను మాత్రమే కాకుండా ఇతర మైనారిటీ వర్గాలను కూడా ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ వక్ఫ్ బోర్డు గతంలో వక్ఫ్ సవరణ బిల్లు 2024ను వ్యతిరేకించింది, దీనిని ముస్లిం సమాజం, వక్ఫ్ సంస్థలను లక్ష్యంగా చేసుకునే “తిరోగమన చర్య”గా పేర్కొంది. ఈ బిల్లు వక్ఫ్ బోర్డు స్వయంప్రతిపత్తిని నాశనం చేస్తుందని, వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువస్తుందని బోర్డు వాదించింది. ఈరోజు నిరసన తెలంగాణలోని మైనారిటీ వర్గాల నుంచి ప్రతిపాదిత సవరణలపై కొనసాగుతున్న ఆందోళనలు, వ్యతిరేకతను హైలైట్ చేస్తుంది. ఇట్టి కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు ఖలీల్ అహ్మద్, మొల్ల మైబు, జమీల్ అహ్మద్, చందవాలి, భాష, మౌలాలి, హాజు, అకీల్, మైను తదితరులు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.