ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయమే కొత్త దుస్తులు ధరించి ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు పండుగ సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మహబూబ్‌నగర్, వనపర్తిలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, నారాయణపేట, కల్వకుర్తి, మక్తల్‌లో మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, జైపాల్ యాదవ్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డితోపాటు ప్రస్తుత ఎమ్మెల్యేలు, నాయకులు ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, మార్చి 31
మతసామరస్యానికి ప్రతీక
వనపర్తి టౌన్, మార్చి 31 : రంజాన్, ఉగాది పండుగలు ఒకేసారి రావడం శుభసూచకమని, ఇది మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం మాజీ మంత్రి స్వగృహంలో ము స్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా మాజీ మంత్రిని ముస్లిం మతపెద్దలు శాలువాతో సన్మానించారు. అలాగే ముస్లిం మత పెద్దలను మాజీ మంత్రి అలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముస్లింలకు రంజాన్ తోఫా, షాదీముబారక్ అందించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఇమ్రాన్, రహీం, గులాంఖాదర్, జోహెబ్హుస్సేన్, ఖాదర్, బీఆర్ఎస్ నాయకులు గట్టుయాదవ్, వాకిటీ శ్రీధర్, రమేశ్‌గౌడ్, కృష్ణ, తిరుమల్, రవి, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, గిరి, రాము, రహీం, శ్రీను, సర్దార్‌ఖాన్ పాల్గొన్నారు.
ఈద్గా వద్ద మాజీ మంత్రికి అవమానం
మహబూబ్‌నగర్ అర్బన్, మార్చి 31 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం రంజాన్ ప్రార్థనల అనంతరం ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపే వేదిక మీద మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సీటు కేటాయించకపోవడంత తీవ్ర దుమారం రేపింది. ప్రతిసారి సం ప్రదాయాలకు భిన్నంగా మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన ఈ వేది క మీద కేవలం కాంగ్రెస్ వారికి మాత్రమే సీట్లు కేటాయించారు. అంతేకాకుండా ఏకంగా కుర్చీలకు నేమ్ బోర్డులు పెట్టారు. దీంట్లో మాజీ మంత్రి పేరు లేదు.
గతంలో అన్ని పార్టీల నేతలను గౌరవించే సంప్రదాయం కొనసాగేది. ఈసారి ఈద్గా కమిటీ కూడా పాత పద్ధతికి తిలోదకాలు ఇవ్వడంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వేదిక పక్కకు వచ్చి మాజీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకుల ప్రోద్భలంతో కావాలని అవమానించారని విరుచుకుపడ్డారు. కాగా వేదిక మీద లేకున్నా చాలామంది మాజీ మంత్రిని కలిసేందుకు పోటీ పడ్డారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఖంగుతిన్నారు.
పండుగలతో సోదరభావం
మహబూబ్‌నగర్ అర్బన్, మార్చి 31: పండుగలు సోదరభానికి నిదర్శనమని.. రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం రంజాన్ పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు సమీపంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
మాజీ మంత్రి మాట్లాడుతూ.. హిందూ, ముస్లిం బేధాభిప్రాయాలు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో గంగా, జమున, తహజీబ్‌ను తీసుకొచ్చి దేశంలో ఆదర్శంగా నిలిచామన్నారు. ముస్లింల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రహెమాన్, శివరాజ్, జావేద్ పాల్గొన్నారు.