మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబర్ 4 : శుక్రవారం నాడు ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో.! చన్నీటి జలకాలు ఉయ్యాలో ముత్యమంత పసుపు ఉయ్యాలో.! అంటూ విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు సంస్కృతీ సంపద్రాయాలు ప్రతిబింబించేలా పీయూలో మన బతుకుమ్మ వేడుకలను నిర్వహించుకున్నారు.
ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యం లో చేపట్టిన కార్యక్రమంలో బతుకమ్మలను తలపై ఎత్తుకొని బొడ్డెమ్మలు వేస్తూ పూల సింగిడిని అంబరాన్నంటేలా నిర్వహించుకున్నారు. బతుకమ్మ వేడుకలతో పాలమూరు విశ్వవిద్యాలయం పులకించిపోయింది. అన్ని విభాగాల్లో పూల పండుగ పరిమళాలు వెదజల్లుతున్నాయి. ప్రతి విభాగం ఓ పూలవనమైం ది. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని, వారసత్వాన్ని చాటే బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలచేది బతుకమ్మ పండుగ అని పీయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి అన్నారు. పీయూ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం పీయూలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఆడపడుచులంతా సంబురంగా నిర్వహించుకునే వేడుక అన్నారు.
బంధాలను, అనుబంధాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమాల్లో ఎన్ఎస్ఎస్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ, ప్రిన్సిపాళ్లు నూర్జహాన్, చంద్రకిరణ్, బషీర్ అహ్మద్, పీయూ పీఆర్వో శేకుంటి రవికుమార్, వివిధ విభాగాల అధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది యూనియన్ నాయకులు పాల్గొన్నారు.