ఎర్రవల్లి చౌరస్తా, మే 29 : విహారయాత్ర విషాదంగా మారిన ఘటన ఎర్రవల్లి మండలం ఇటిక్యాల పీఎస్ పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున చోటుచేసుకున్నది. ఎస్సై వెంకటేశ్ కథనం మేరకు మేడ్చల్ జిల్లా నిజాంపేటకు చెందిన ఎర్ర వెంకటబాబ్జి(40) హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఇంజినీర్. ఆయన తన కుటంబ సభ్యులు భార్య శ్రా వణి(38), పిల్లలు సాయిచైత్ర(7), లక్ష్మీసహస్త్ర(11)తో కలిసి ఈ నెల 24వ తేదీన తన కారులో ఊటీకి విహారయాత్రకు వెళ్లారు.
వారి యాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా శుక్రవారం తెల్లవారు జా మున 6గంటల ప్రాంతంలో ఇటిక్యాల మండలం మునగాల శివారు దగ్గర జాతీయ రహదారిపై ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా సిమెంట్ లోడ్‌తో ఆగిఉన్న లారీని ఎర్ర వెంకటబాబ్జి కారు వెనుకనుంచి ఢీకొటగ్టడంతో శ్రావణి అక్కడికక్కడే మృతిచెందింది. మిగిలిన ముగ్గురుకు తీవ్ర గాయాలు కాగా వారిని వెంటనే హైవే అంబులెన్స్‌లో కర్నూల్ ఓమిని దవాఖానకు తరలించగా కూతురు సాయిచైత్ర చికిత్స పొందుతూ మృతిచెందింది.
తీవ్ర గాయాలైన లక్ష్మీసహస్త్రకు చికిత్స కొనసాగుతున్నది. రోడ్డుపై నిర్లక్ష్యంగా లారీని ఆపి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మల్లికార్జున్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు వెంకటబాబ్జీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.