అలంపూర్, ఆగస్టు 21 : వర్షాభావ పరిస్తితులను దృష్టిలో ఉంచుకొని సరైన సమయంలో ఆయకట్టు భూములకు సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా రైతులను ఆదుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఇరిగేషన్ అధికారులను కోరారు. ఈ మేరకు శుక్రవారం రైతులతో కలిసి జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో ఎస్ఈ కేశవరావును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు, ఆయకట్టు రైతులతో కలిసి ప్రాజెక్టు పరిధిలోని గుడెందొడ్డి రిజర్వాయర్‌ను, కెనాల్‌ను, పెండింగ్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎమ్మెల్యేతోపాటు బీఆర్ఎస్ నాయకులు, రైతులు బాలకృష్ణారెడ్డి, షాబాద సర్పంచ్ డేవిడ్, మాజీ తిప్పన్న, మాజీ ఎంపీటీసీ జయన్నగౌడ్, గోపల్‌దిన్నె సర్సంచ్ సర్వారెడ్డి, అనంతరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, రాజు, నాగరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
2005లో రూ.1428 కోట్ల అంచనా వ్యయంతో జవహర్ నెట్టెంపాడు ప్రా జెక్టు చేపట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2019 లో అంచనా వ్యయాన్ని మరో సారి రూ.2.548 కోట్లకు పెంచారు. 2022లో మరోసారి రూ.2700 కోట్లు పెంచారు. నేటి వరకు సుమారుగా 2,400 కోట్ల పైనే ఖర్చు చేసినట్టు సమాచారం. అయినా పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. కృష్ణ నదిలో వరద ఉన్నప్పుడు 20 టీఎంసీల నీరు ఎత్తిపోయడం ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం అందుకనుగుణంగా మొదటి దశలో గుడెందొడ్డి రెండో దశలో ర్యాలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను, ర్యాలంపాడు కింద ఐదు జలాశయాలు నిర్మించారు.
నడిగడ్డ ప్రాంతంలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని సుమారు 2 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే నెట్టెంపాడు ప్రాజెక్టు నిర్మించారు. కానీ ప్రాజెక్టు ద్వారా కేవలం 1.45 లక్షల ఎరాలకు మాత్రమే నీరందుతోంది. రెండు దశాబ్దాల కిందట ప్రారంభించిన పనులు ప్రభుత్వ నిర్లక్షం, నిధుల లేమి వల్ల నేటికీ నత్త నడకన సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా భూ సేకరణ పనులు కూడా చేపట్టాల్సి ఉన్నది.
నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని కాల్వలు, రిజర్వాయర్ల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరందడం లేదు. నిర్మాణ పనుల విషయంలో ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయి. కొన్ని చోట్ల భూ సేకరణ సమస్యలు, మరికొన్నిచోట్ల కాంట్రాక్టర్ల నిర్లక్షం కారణంగా పనుల్లో జాప్యం జరుగుతున్నది. సాగునీరందించే విషయంలో అధికారులు విఫలం అవుతున్నారు.99వ ప్యాకేజీ జిల్లాలోని గద్వాల మండలం కొండపల్లి, ధరూర్ మండలం పరిధిలో ఉంటుంది. ఈ ప్యాకేజీ పనులను 99ఏ, 99బీ, 99సీ, 99డీ ఉప భాగాలుగా విభజించారు. వీటిలో కొన్ని పనులు పూర్తి అయినప్పటికీ మరికొన్ని పనులు పూర్తి కావలసి ఉంది. అయిజ రోడ్, కొండపల్లి రోడ్, రాయిచూర్ అంతర్రాష్ట్ర రోడ్డు వంతెన పనులు పూర్తి కావాలసి ఉంది.
99వ ప్యాకేజీ పనులు పూర్తవుతాయా ఆయకట్టుకు నీరు అందుతుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. పూర్తి కాని కుడి కాల్వ పనులు నెట్టెంపాడు ప్రాజెక్టు లిఫ్ట్ కింద ధరూర్ మండలంలో 1.19 టీఎంసీ సామర్థ్యంతో గుడ్డెందొడ్డి రిజర్వాయర్ నిర్మించారు. ప్రస్తుతం 15 టీఎంసీలకు పెంచాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఆయకట్టుకు సాగునీరందించేందుకు కుడి ఎడమ కాల్వలను నిర్మించారు. ఎడమ కాల్వ కింద 6 వేల ఎకరాలకు సాగునీరందుతుంది. కుడి కాల్వ పనులు పూర్తి కాలేదు. ఈ పనులను 99, 100వ ప్యాకేజీలుగా విభజించారు. ధరూర్, గద్వాల, ఇటిక్యాల మండలాల పరిధిలో 76 కిలో మీటర్ల పొడవున కాల్వలు నిర్మించాలి ఇటిక్యాల మండలంంలో 100 వ ప్యాకేజీ పనులు ప్రారంభం అవుతాయి. సుమారు 40 కిలో మీటర్ల పొడవునా పనులు పూర్తి అయ్యాయి.