Maktal | మక్తల్, జూన్ 03 : మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులకు రెండు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మున్సిపల్ కార్మికుల వినతిపత్రాన్ని అందజేయడం జరిగిందని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కిరణ్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులకు రెండు నెలల నుండి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడే మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తుందని పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందినప్పటికీ నేటి కాలంలో మున్సిపల్ కార్మికులు అపరిశుభ్రమైన గుంతల్లో దిగి శుభ్రం చేస్తూ ఊపిరాడక శవాలుగా మిలిగిపోతున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం వారు చేసిన కష్టానికి వేతనాలు అందించడంలో జాప్యం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మున్సిపాలిటీలలో బడ్జెట్ లేదని కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా కాలయాపన చేయడం సరైంది కాదన్నారు. మున్సిపల్ కార్మికులకు వెంటనే పెండింగ్ వేతనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు బండారి రవి, బాలు, కృష్ణయ్య, మహేశ్వరమ్మ, శంకరమ్మ, సుజాత, ఆకాష్, హనుమంతు, రామలింగం, వెంకటేష్, నర్సింలు, మల్లేష్, మారుతి, మారెప్ప, జగ్గలి రాములు, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
వేణుగోపాల స్వామి దేవాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యేకు అందజేత
మక్తల్ పట్టణంలో అతి పురాతనమైన దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ప్రారంభోత్సవం ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంగళవారం ఉదయం వేణుగోపాల స్వామి దేవాలయం పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు డాక్టర్ శ్రీరాములు ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరాములు మాట్లాడుతూ.. వందల సంవత్సరాల వేణుగోపాల స్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేపట్టి దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా వేణుగోపాలస్వామి గురుత్మంతుడు, గణపతి, ధ్వజస్తంభ, శిఖర పున ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్యేకు సూచించడం జరిగిందన్నారు. ఈనెల 6వ తేదీన ఉదయం 6 గంటలకు విగ్రహాల ఊరేగింపు, 8 గంటల నుండి గోపూజ ధ్వజారోహణము, మండప ప్రవేశం, అఖండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దేవాలయ ప్రారంభోత్సవంలో ప్రధాన ఘట్టమైనటువంటి ఈనెల 8వ తేదీన ఆదివారం ఉదయం 7:48 నిమిషాలకు స్వామివారి విగ్ర ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమానికి భక్తులు వేలాది సంఖ్యలో హాజరై దేవాలయ ప్రారంభ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.