గద్వాల, జూన్ 21 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కీలకపాత్ర పోషించిన జయశంకర్‌సార్ ఆశయాలను ప్రతిఒక్కరూ కొనసాగించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్టుక నీది.. చావు నీది.. నడుమ జీవితమంతా తెలంగాణది.. అనే నినాదాన్ని నమ్మి ఆచరించిన వ్యక్తి జయశంకర్ సార్ అని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమ పోరాట మే కాకుండా రాజకీయ ప్రక్రియ అవసరమని కేసీఆర్‌కు మార్గనిర్ధేశం చేసిన గురువు జయశంకర్ సార్ అన్నారు. చదువుకునే రోజుల్లోనే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వివక్షను ప్రశ్నించిన ధీరోదాత్తుడన్నారు. తన 50ఏండ్ల పోరాటకాలంలో మూడు దశల తెలంగాణ పోరాటాలకు ప్రత్యక్ష సాక్షి అని అన్నారు. యాచించే స్థాయి నుం చి శాసించే స్థాయికి తెలంగాణ రావాల్సిన ఆవశ్యకతను వివరించడానికి తానే స్వయంగా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో సమర చైతన్యాన్ని నింపిన వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్‌కుమార్, మున్సిపల్ వైస్‌చైర్మన్ బాబర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గడ్డం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.