కొల్లాపూర్, జూన్ 16 : 40ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను ఎట్టకేలకు సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పరిష్కరించారు. మండలంలోని ఎర్రగట్టు బొల్లారం శ్రీశైలం నిర్వాసితులు 80మందికి శుక్రవారం నివేశన పట్టా సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. దశాబ్దాలుగా తమకు ఖాళీ స్థలాలు ఇవ్వాలని గత ప్రభుత్వాల పాలనలో మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నో అర్జీలు పెట్టుకున్నా ప్రయోజనం లేకుండాపోయింది. 1980లో నల్లమల అడవిలోని కృష్ణానదితీరంలో అడవి బొల్లారం గ్రామం శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురికావడంతో అప్పట్లో నిర్వాసితులకు పునరావాసం పేరుతో అక్కడి నుంచి రెవెన్యూ అధికారులు తరలించి చేతులు దులుపుకున్నారు.
ఈ సమస్యపై ఎమ్మెల్యే బీరం ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ఎట్టకేలకు నివాసం ఉండేందుకు ఖాళీ స్థలాల పట్టాలను తాసీల్దార్ శివశ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ.. 40ఏండ్లుగా పరిష్కారం కానీ సమస్య బీఆర్ఎస్ సర్కార్‌లో తీరిందని, ఎల్లప్పుడూ అండగా ఉండే కేసీఆర్ ప్రభుత్వానికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బోడబండతండా ఎంపీటీసీ శంకర్‌నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ గోవింద్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.