గద్వాల, డిసెంబర్ 11: గద్వాల మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని దౌదర్పల్లి శివారులో రూ.39కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 300పడకల దవాఖాన పనులను మున్సిపల్ చైర్మన్ కేశవ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై ఎమ్మెల్యే బండ్ల కాంట్రాక్టర్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు సహకారంతో జిల్లా కేంద్రంలో 300 పడకల దవాఖాన నిర్మాణ పనులు చేపట్టామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ విద్య, వైద్యరంగానికి పెద్దపీట వేశారని చెప్పారు. ప్రస్తుతం దవాఖాన పనులు 90శాతం పూర్తికావచ్చాయని, మిగతా పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు.
పనులు పూర్తి కావడానికి ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో వచ్చే ఏడాది మార్చినాటికి పనులు పూర్తిచేసి గద్వాల ప్రజలకు అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజలు నాకు రెండోసారి పట్టం కట్టారని, వారి ఆశలు అడియాశలు చేయకుండా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. సీఎం రేంవత్‌రెడ్డి సహకారంతో గద్వాల నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రజలకు విద్య, వైద్యం ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రభుత్వ కాలంలో ఈ రెండింటికీ ప్రాధాన్యత ఇచ్చి వాటిని అభివృద్ధి చేశామని తెలిపారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధే నాధ్యేయమన్నారు. అనంతరం జిల్లాపరిషత్ కార్యాలయ సమీపంలో ఆధునిక హంగులతో నిర్మిస్తున్న నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనులను గ్రంథాలయ చైర్మన్ రామన్‌గౌడ్‌తో కలిసి పరిశీలించారు. గ్రంథాలయ నిర్మాణం త్వరగా పూర్తి చేసి పట్టణ ప్రజలతోపాటు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకరావాలని అధికారులను ఆదేశించారు. గ్రంథాలయాన్ని ఆధునిక వసతులతో అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.