గద్వాల, ఏప్రిల్ 4 : పేదలకు బీఆర్ఎస్ జెండా అండగా ఉంటుందని.. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ధరూర్ మండలంలోని చింతరేవుల చౌరస్తాలో మంగళవారం బీఆర్ఎస్ మండల నాయకులతో పార్టీ మండలాధ్యక్షుడు విజయ్‌కుమార్ అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొంతమంది పగటి వేశగాళ్లు మొఖాలకు రంగులు వేసుకొని గ్రామాల్లోకి వచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే వ్యక్తి కావాలో.. ఎన్నికలప్పుడు వచ్చి తేనె పూసిన మాటలు చెప్పే వారు కావాలో తేల్చుకోవాలన్నారు.
గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో ప్రజలు నిలదీయాలన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తొమ్మిదేండ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలకు సమప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నాయని, ఇది చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు ఉనికిని కాపాడుకునేందుకు పసలేని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఓటు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్కే ఉందన్నారు. గత పాలకులు తాగు, సాగు నీరందించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రైతులకు పెట్టుబడి సాయంతోపాటు రైతుబీమా, ఉచిత విద్యుత్ వంటి వాటితో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా చేశారన్నారు.
అన్నదాతలను గౌరవిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. గొల్లకురుమలకు త్వరలో గొర్రెలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. ధరూర్ మండలంలో వివిధ సంక్షేమ పథకాల కోసం రూ.311 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బానిస బతుకులకు విముక్తి కలిగిందన్నారు. బీజేపీ నేతలు అధికారం లేక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నజమున్నీసాబేగం, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామన్‌గౌడ్, పాగుంట ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, సర్పంచులు రఘురెడ్డి, శిల్ప, శివారెడ్డి, జయమ్మ, నాయకులు కృష్ణారెడ్డి, ఈశ్వరయ్య, సర్వారెడ్డి, ప్రభాకర్‌గౌడ్, బసిరెడ్డి, ఆంజనేయులు, సుజాత, రమేశ్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.