Kollapur | కొల్లాపూర్, ఫిబ్రవరి 15 : కొల్లాపూర్ పట్టణంలో మిషన్ భగీరథ లీకేజీని అరికట్టడం లేదు. బస్టాండ్ ఆవరణలో బురద బెడద తీరడం లేదు. యథా రాజా తథా ప్రభు అన్నచందంగా అధికారుల తీరు ఉంది. గత కొద్ది వారాల నుంచి కొల్లాపూర్ పట్టణంలోని బస్టాండు సమీపంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ మూలంగా నీళ్లు వృధాగా పోతున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. లీకేజీకి మరమ్మతులు చేయకపోవడంతో ప్రయాణికులతో పాటు పట్టణ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లీకేజీని అరికట్టాలని ప్రజా సంఘాల నాయకులు అధికారులను కోరిన స్పందించలేదన్నారు. దీంతో బురద నీళ్లు మిషన్ భగీరథ పైపుల్లో కలవడంతో కలుషితమైన నీళ్లను తప్పని పరిస్థితుల్లో తాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.