మహబూబ్‌నగర్, ఏప్రిల్ 5: పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కుట్ర బీజేపీ నాయకులదేనని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. విద్యార్థుల జీవితాలతో బీజేపీ నాయకులు ఆడుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు.
రాజకీయ అవసరాల కోసం బీజేపీ నేతలు పేపర్ లీక్ చేసి విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేయడం దుర్మార్గమన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నిందితుడు కూడా బీజేపీ కార్యకర్తేనని.. ఇప్పుడు కూడా పదోతరగతి పేపర్ లీక్ పేరిట బీజేపీ నాయకులు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కుల రాజకీయాలు చేసుకుంటూ సమాజంలో చిచ్చుపెట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.
చేతనైతే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు అందిస్తూ సహకరించాలని.. ఇలా అర్థం, పర్థం లేని ఆరోపణలు చేయడమేంటని అసహనం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ చేసి కూడా నీతిమాటలు మాట్లాడడం బీజేపీ నేతలకే చెల్లుతుందన్నారు. ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పేపర్ లీక్ చేయడాన్ని సర్వసాధారణ అంశంగా పేర్కొంటున్నారని.. తెలంగాణలో మాత్రం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పేపర్ లీక్ కుట్రలో ఉన్నది ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత బలమైనదని, కుట్రదారులను వెంటనే అరెస్టు చేసి ఇలాంటి చర్యలకు భయపడేలా చేస్తామన్నారు. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కేంద్రం.. ఆ విషయాన్ని పక్కనపెట్టి ప్రైవేటీకరణ పేరుతో ఉన్న ఉద్యోగాలకు కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నదన్నారు. ప్రతిక్షణం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వ విధానాలకు బీజేపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని తెలిపారు. సరైన సమయంలో బీజేపీ నేతలకు ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ తాటి గణేశ్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.