భూత్పూర్ : ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులు (Mid-day meal workers) పరిశుభ్రతను పాటిస్తూ భోజనాన్ని తయారు చేయాలని కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ బాలు యాదవ్ ( CMO Balu Yadav ) కోరారు. బుధవారం మండలంలోని అన్ని కాంప్లెక్స్ కేంద్రాలలో మధ్యాహ్న భోజన కార్మికులకు వంట చేయడంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తాటికొండ గ్రామంలో మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ఇవ్వాలనే ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకంలో అధికారుల కంటే మధ్యాహ్న భోజన కార్మికులదే ప్రధాన పాత్రని అన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రావడానికి ప్రధాన ఆకర్షణ మధ్యాహ్న భోజన పథకం ఒకటని అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పౌష్టికాహారం అందించాలని అన్నారు.
విద్యార్థులకు మంచి భోజనం అందించినప్పుడే విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించే అవకాశాలు ఉంటాయని ఆయన సూచించారు. రేపటి నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న సందర్భంగా అన్ని పాఠశాలలో పండగ వాతావరణం నెలకొని ఉండాలని సూచించారు. 12న పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలను నిర్వహించి, పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఉషారాణి, క్లస్టర్ హెడ్ మాస్టర్ ఆనందమ్మ, ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.