కొల్లాపూర్, జూలై 5 : కృష్ణానదికి వరద రాక ముందుగానే ప్రారంభమైంది. ఈసారి ఏడాది ముందుగానే ప్రవాహం వచ్చి.. జూరాల ప్రాజెక్టు గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేసినా ఎంజీకేఎల్ఐ ఎత్తిపోతల మోటర్లు మాత్రం ఆన్ కావడం లేదు. లిఫ్ట్ ఆయకట్టు రైతులు తుకాలను పోసుకుంనేందుకు సాగునీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.
కళ్ల ముందు నీళ్లు సముద్రం పాలవుతున్న పాలకులు మాత్రం కండ్లు తెరవడం లేదని రైతులు, రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎం జీకేఎల్ఐ ద్వారా రైతులకు మాత్రమే గాక.. భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం నీళ్లను నిల్వ చేసుకునేందుకు అవకా శం ఉన్నది. గతేడాది ప్రభుత్వానికి ముందుచూపు లేక కృష్ణానది నీటిని ఒడిసి పట్టలేదు. నదిలో ప్రవాహం తగ్గిపోయిన వెంటనే తాగునీటి అవసరాల పేరుతో ఎంజీకేఎల్ఐ ప్రధాన కాల్వకు నీళ్లను బంద్ చేశారు. దీంతో పంటలను ఎండబెట్టారని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు కూడా కృష్ణానదికి భారీ వరద వచ్చినా నీళ్లను ఒడిసిపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఈ సంవత్సరం జూన్ నెల మొదటి వారంలోనే కృష్ణా, తుంగభద్ర నదులకు వరద ప్రారంభమైంది. శ్రీశైలంలో 815 అడుగుల నీటి మట్టం ఉన్న సమయంలో తాగునీటి కోసం ఎంజీకేఎల్ ద్వారా నీళ్లను డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం శ్రీశైలం నీటిమట్టం 875 అడుగులుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా మోటర్లను ఆన్ చేయలేదు. కృష్ణానది నుంచి నీళ్లను డ్రా చేసేందుకు ఇరిగేషన్ అధికారులు రాత్రి, పగలు కష్టపడి మోటర్లకు యానివల్ మెయింటనెన్స్ పూర్తి చేశారు. నీళ్లను డ్రా చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం తెలంగాణ రైతులకు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేనట్లు ఉన్నదని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. దాదాపు 365 రోజులపాటు కృష్ణానది నీటిని డ్రా చేసుకునేందుకు అవకాశం ఉన్నా ఇంత వరకు మోటర్లను ఆన్ చేయకపోవడానికి గల కారణాలేమిటో ఎవరికీ అర్థం కావు.
240 రోజులపాటు కృష్ణానది నీటిని డెడ్ స్టోరీజీ పాయింట్‌లోని రేగుమానుగడ్డ వద్ద నుంచి డ్రా చేసుకునేందుకు అవకాశం ఉన్నది. అయినా ప్రజాపాలన ప్రభుత్వం కేవలం 800 క్యూసెక్కులను డ్రా చేసే 30 మెగా వాట్స్ సామర్థ్యం ఉన్న ఐదు మోటర్లను ఏర్పాటు చేసింది. ఇందులో ఒకటి స్టాండ్‌బై మోటర్ కాగా మరో ఒక మోటర్ కాంగ్రెస్ ప్రభుత్వం షెట్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో నీట మునిగి పడైపోయింది. అయితే ఒకటి, రెండు మోటర్లు ఆన్ చేస్తేనే కాల్వలు నిండుగా పారేలా నాడు ప్రాజెక్టును డిజైన్ చేశారు.
దీంతో 13 వేల ఎకరాల ఆయకట్టుకు పరిమితం చేసేందుకు సమైఖ్య పాలన కుట్ర చేసిందన్న విషయం అందరికీ అర్థమవుతోన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 13 వేల ఎకరాల నుంచి 3.65 లక్షల ఎకరాల వరకు సాగు సామర్థ్యాన్ని ప్రణాళికతో పెంచింది. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో 2,68,165 ఎకరాలు, వనపర్తి పరిధిలో 78 వేల ఎకరాలు, మహబూబ్‌నగర్ పరిధిలో 9,015 ఎకరాలు, శంషాబాద్ పరిధిలో 9,820 ఎకరాలకు సాగు నీరు అందుతున్నది.
ఎంజీకేఎల్ కింద ఉన్న ఎల్లూరు రిజర్వాయర్ 0.35 టీఎంసీలు, సింగోటం రిజర్వాయర్ 0.55 టీఎంసీలు, జొన్నలబొగుడ 2.14 టీఎంసీలు, గుడిపల్లి రిజర్వాయర్‌లో 0.98 టీఎంసీలు ఉండాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీనివా ద్వారా నీళ్లను డ్రా చేసేందుకు సిద్ధమవుతుంటే ఇక్కడ మాత్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఎంజీకేఎల్ ఆయకట్టు రైతులు సాగు నీటి కోసం ఎదురు చూస్తున్నారు.
ఎంజీకేఎల్ఐ మోటర్లను ఆన్ చేసి సాగు నీరు అందించాలని ప్రజా సంఘాలు, రైతులు సంఘాలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సకాలంలో సాగునీరు అందిస్తే ఎంజీకేఎల్ఐ కింద మూడు పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తక్షణమే ఎంజీకేఎల్ఐ మోటర్లను ఆన్ చేయాలని రైతులు కోరుతున్నారు.
వరద వచ్చినా మోటర్లను ఎందుకు ఆన్ చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పటికే ఎంజీకేఎల్ఐ కింద పంటల సాగు ఆలస్యమవుతున్నది. వెంటనే సాగు పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే రైతులు పంటల సాగుకు నీటి కోసం ఎదురుచూస్తున్నారు.
– బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
ప్రస్తుతం యానివల్ మెయింటనెన్స్ నడుస్తున్నది. ఒక పంప్ పూర్తయ్యింది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే మోటర్లు ఆన్ చేసేందకు సిద్ధంగా ఉన్నాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాల్వల్లో నీళ్లు పారుతాయి.
– లోక్‌నాథ్, డీఈ, ఎంజీకేఎల్ఐ