జడ్చర్లటౌన్, ఏప్రిల్16 : హైదరాబాద్ ఉస్మానియా దవాఖానలో పీజీ చదువుతున్న కాట్రావత్ సురేశ్ మృతితో జడ్చర్ల మండల పరిధిలోని భీమ్లానాయక్ తండాలో విషాదం నెలకొన్నది. మండలంలోని భీమ్లానాయక్ తండాకు చెందిన కాట్రావత్ సురేశ్ (25) ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానలో ఎంఎస్ జనరల్ సర్జరీ(పీజీ) ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఆ విద్యార్థి తండ్రి చందర్‌నాయక్ రైతు, తల్లి నాగమణి అంగన్వాడీ ఆయాగా పనిచేస్తూ తన కుమారుడిని ఉన్నత విద్యను చదివిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పీజీ హాస్టల్ గదిలో ఓవర్‌డోస్ మత్తు ఇంజక్షన్ తీసుకుని సురేశ్ ఆత్మహత్య చేసుకున్న సమాచారంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌ను తట్టుకోలేక కాట్రావత్ సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని తండావాసులు తెలియజేశారు.
అలంపూర్ చౌరస్తా, ఏప్రిల్ 16 : ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులను చితకబాదిన ప్రిన్స్‌పాల్‌ను కలెక్టర్ రిజ్వాన్‌బాషా ఆదేశాల మేరకు సస్పెండ్ చేశామని జిల్లా ఆర్సీవో శ్రీనివాసులు తెలిపారు. బుధవారం జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులు, ఆర్సీవో అధికారులు పాఠశాలకు వచ్చి దాడి జరిగిన విషయన్ని విద్యార్థులతో విచారించి అన్ని వివరాలను నివేదిక రూపంలో కలెక్టర్‌కు అందజేశారు. దీంతో కలెక్టర్ రిజ్వాన్‌బాషా ప్రిన్సిపాల్ రామకృష్ణయాదవ్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే అతడిని నాగర్‌కర్నూల్ జిల్లాకు జేఎల్‌గా బదిలీ చేశామని ఆర్సీవో శ్రీనివాసులు తెలిపారు.
మాగనూర్, ఏప్రిల్ 16 : మాగనూర్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేయాలని ఉమ్మడి మండల రైతులు డిమాండ్ చేశారు. బుధవారం మాగనూర్ మండలంలోని వర్కూర్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కల్లాల వద్ద రైతులు నిరసన వ్యక్తం చేయగా దీనిపై ‘నమస్తే తెలంగాణ’ వార్త ప్రచురితం కాగా స్పందించిన అధికారులు మాగనూర్ మండల కేంద్రంలోని పీఏసీసీఎస్ కార్యాలయంలో అలాగే కృష్ణ మండలంలోని గుడెబల్లూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాగనూర్, కృష్ణ ఇన్చార్జి తాసీల్దార్ శ్రీనివాసులు, వ్యవసాయాధికారి సుదర్శన్గౌడ్లు ప్రారంభించారు. అయితే జిల్లా వ్యాప్తంగా వరి కొనుగోలు చేసేందుకు మిల్లులు ట్యాగ్ కాకపోవడం గమనార్హం.