‘అభివృద్ధి చెందుతున్న దేశం అని కొన్నేండ్లుగా వింటున్నాం.. అభివృద్ధి చెందిన దేశంగా మారాలి.. బంగారు భారతం కేవలం
కేసీఆర్‌తోనే సాధ్యం.. ఆయన దేశ రాజకీయాల్లోకి రావాలి.. తెలంగాణలోని పల్లెల్లా దేశంలోని ప్రతీ గ్రామం కావాలి.. సీఎం కేసీఆర్‌తోనే దేశానికి మంచి రోజులు వస్తాయి’.. అని గ్రామాల ప్రథమ పౌరులు ఘంటాపథంగా చెబుతున్నారు. కేసీఆర్ దేశానికి సుపరిపాలన అందించాలని ఆకాంక్షిస్తున్నారు. బీజేపీ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా మారాయని, పెరిగిన ధరలతో దేశంలో సామాన్యులంతా ఇబ్బందులు పడుతున్నార న్నారు. దేశాన్ని సరైన బాటలో నడిపేందుకు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక్క నాయకుడూ లేడని, ఇలాంటి పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడాలంటే కేసీఆర్ వంటి సమర్థవంతమైన నాయకుడు అవసరమని అంటున్నారు. విజన్ ఉన్న నాయకుడు, దేశంలో మార్పు తెచ్చే శక్తి ఆయనకే ఉందని చెబుతున్నారు. మత సామరస్యం వర్ధిల్లాలన్నా.. అమెరికా, చైనా దేశాల సరసన భారత్ చేరాలన్నా కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.
సిద్దిపేట, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ర్టాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పల్లెలు అద్భుతమైన ప్రగతిని సాధించాయి. మన పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైంది.. గ్రామాలకు సీఎం కేసీఆర్ మహర్దశ తెచ్చారు. ఇలాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి.. అప్పుడే దేశ స్థితి మారుతుంది’.. అని గ్రామాల ప్రథమ పౌరులు పేర్కొంటున్నారు. దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని అంటున్నారు. మన రాష్ట్రంలో అభివృద్ధి చెందినట్లుగా ఇతర రాష్ర్టాల్లోని గ్రామాలు కావాలని, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారుల బృందాలు ఇక్కడికి వచ్చి అభివృద్ధిని చూసి, వారివారి రాష్ర్టాల్లో ఇక్కడిలా చేసుకుంటున్నారు. ఏటా కేంద్రం ప్రకటించే అవార్డుల్లో సైతం తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు సింహభాగం అవార్డులు సొంతం చేసుకుంటున్నాయి. ఏ రాష్ర్టాలు కూడా తెలంగాణ రాష్ర్టాన్ని అందుకోలేక పోతున్నాయి. కేసీఆర్‌లాంటి ముఖ్యమంత్రులుంటే, తెలంగాణ తరహాలోనే అన్ని రాష్ర్టాలు అభివృద్ధి చెందుతాయని పలువురు ప్రజాప్రతినిధులు ఘంటా పథంగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారి పోయాయి. సమగ్ర పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టి పల్లెల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారు. వివిధ దశలో పల్లె ప్రగతిని చేపట్టి బ్రహ్మాండమైన ఫలితాలను సాధించాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేసి, లక్షల మొక్కలు పెంచుతున్నారు. గ్రామాలు శుభ్రంగా ఉండేలా నిత్యం చెత్త సేకరణ చేయడానికి ప్రతి పంచాయతీకి ట్రాక్టరు సౌకర్యం కల్పించారు. గ్రామాల్లో ఇంటింటా తడిపొడి చెత్తను సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన చెత్తను గ్రామాల్లో నిర్మించిన డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఈ ఎరువును గ్రామంలో హరితహరం కింద నాటిన మొక్కలకు పోస్తారు. గ్రామాల్లో సేద తీరేందుకు ప్రకృతి వనం, అడవిని తలపించేలా పచ్చని చెట్లతో వైకుంఠధామాలు, ప్రభుత్వ సందేశం తెలియజేయడానికి మైకులు, గ్రామంలో ఏ మూలన ఏం జరిగిందో ఇట్టే తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు, వ్యాయామం చేయడానికి ఓపెన్ జిమ్‌లు, మినీ ట్యాంక్ బండ్‌ను తలపించేలా చెరువుల అందాలు, ఇలా ఎన్నో హంగులు సంతరించుకొని ఆదర్శంగా నిలిచాయి గ్రామాలు. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి పైసాను వినియోగించుకుంటున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు.
ఒకప్పుడు మూడు, నాలుగు గ్రామాలకు కలిపి ఒక్క పంచాయతీ కార్యదర్శి ఉండేవారు. జనన సర్టిఫికెట్ కావాలన్నా.. మరణ ధ్రువీకరణ పత్రం కావాలన్నా సమయం పట్టేది. నాలుగు గ్రామాలకు ఒక్కరూ ఉండడంతో ప్రజలకు అందుబాటులో ఉండే వారు కాదు. ఒక రోజు ఇక్కడ.. మరో రోజు ఇంకో గ్రామంలో ఉండేవారు. దీంతో ప్రజలకు మెరుగైన సేవలు అందేవి కావు. సీఎం కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్క కార్యదర్శి ఉండాలని చెప్పి పెద్ద సంఖ్యలో కొత్తగా పంచాయతీ కార్యదర్శులను నియమించారు. ఇవాళ ప్రతి గ్రామానికి ఒక్క పంచాయతీ కార్యదర్శి ఉండడంతో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన సేవలందిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్నారు. పంచాయతీలకు భారీగా నిధుల ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో ఎనిమిదేండ్లలో గ్రామాల స్వరూపం పూర్తిగా మారిపోయింది. పల్లెప్రగతి ద్వారా గ్రామాల అభివృద్ధి కోసం అవసరమైన నిధులను ప్రతినెలా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు రూ.308 కోట్లను విడుదల చేస్తున్నది. పారిశుధ్య పనులు వెంటవెంటనే చేపట్టడంతో గ్రామాల్లో దోమల బెడద క్రమ క్రమంగా తగ్గాయి. ఇవాళ ఎక్కడ చూసినా పరిశుభ్రమైన గ్రామాలు కనిపిస్తున్నాయి. గతంలో గ్రామాలను ఎవరు పట్టించుకోకపోవడంతో గ్రామాల అభివృద్ధి అంతంతగానే ఉండేది. గ్రామాభివృద్ధికి కావాల్సిన నిధులను గత ప్రభుత్వాలు విడుదల చేయలేదు. ఇవాళ ఆ పరిస్థితులు లేవు. ప్రతినెలా పంచాయతీ అకౌంట్లో నిధులు ఠంచన్‌గా జమ అవుతున్నాయి. ఇలా గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేయడంతోనే యావత్తు దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోంది.
బంగారు తెలంగాణ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ దేశాన్ని కూడా బంగారు దేశంగా అన్ని విధాల అభివృద్ధి చేసే సత్తా, సామర్థ్ధ్యం ఉన్నాయి. దేశ్‌కీ నేతగా కావాలని పలు రాష్ర్టాల ప్రజలు, పలుపార్టీల నాయకులు కోరుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అగాధంలో నెట్టింది. జీఎస్టీతో ప్రజలపై భారం వేసింది. ప్రజలు అవస్థలు పాలు చేస్తున్నది. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న నిరంతర విద్యుత్, కల్యాణలక్ష్మి, ఆసరా,రైతుబంధు, బీమా, దళితబంధు వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేయగల సామర్థ్ధ్యం కేవలం మన దేశ్‌కీ నేత సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుంది.
-ఆలేటి నవీనాశ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ బొంతపల్లి, (గుమ్మడిదల)
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజల కష్టాలు, కన్నీళ్లు తుడిచి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో విజయపథంలో నడిపిస్తున్నారు. దేశాన్ని సైతం ముందుకు తీసుకు వెళ్లే సత్తా కలిగిన నాయకుడు.. కేసీఆర్‌తో దేశాభివృద్ధి సాధ్యం. ఏ నిర్ణయం తీసుకున్నా సీఎం కేసీఆర్‌కు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది.
-కవిత, సర్పంచ్ కొండారెడ్డిపల్లి (అందోల్)
తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహానేత సీఎం కేసీఆర్. ఆయన దేశ రాజకీయాల్లో సైతం కీలకంగా వ్యవహస్తారు. ఎనిమిదేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించింది. కానీ కొన్ని దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభివృద్ధి విషయమే మరిచిపోయారు. దేశాభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం.
-స్వర్ణలత. సర్పంచ్. ఖాదీరాబాద్ (వట్పల్లి)
కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను హరించడం హేయమైన చర్య. మొన్నటికి మొన్న వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా విద్యుత్‌ను కూడా బడాబాబుల కంపెనీలకు అప్పజెప్పేందుకు కుట్రలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇక్కడ పరిస్థితులను బట్టి ప్రజలకు అనుకూలమైన విధంగా పాలనా చేస్తున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వచ్చి దేశవ్యాప్తంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరమున్నది.
– విమలా వీరేశం, కంది సర్పంచ్
సీఎం కేసీఆర్ అంటే తెలంగాణ సాధకుడు మాత్రమే కాదు.. ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసిండ్రు. పేదోళ్లు, రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిండు. ముఖ్యంగా తెలంగాణలో రైతురాజ్యాం అమలవుతున్నది. దేశంలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి జరుగుతుంది. దేశస్థితి గతులను మార్చడం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం అవుతుంది.
-సిద్ధ్దగౌడ్, రాయిన్‌పల్లి సర్పంచ్ (మెదక్)
తెలంగాణలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తుండు. దేశ రాజకీయాల్లోకి వస్తే ఎన్నో మా ర్పుల తీసుకొస్తడు.. అప్పుడూ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. రైతుబం ధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ఇస్తున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే రైతులందరికీ తప్పకుండా మేలు జరుగుతుంది.
-పార్వతి. వీఏవో, కొత్తూర్(డి), (కోహీర్)
సీఎం కేసీఆర్ సేవలు దేశానికి చాలా అవసరం. ఎంతో ముందు చూపుగల నేత. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో ఆయన పాత్ర ఉండాలి. తెలంగాణ సాధించిన అభివృద్ధ్దిని ఇతర రాష్ర్టాలు సైతం కోరుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ లాంటి మేధావి దేశ రాజకీయాల్లోకి వస్తే అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రధాని కావడానికి అన్ని అర్హతలు ఉన్న గొప్ప నేత.
-పడాల శివప్రసాద్‌రావు, దామరచెర్వు సర్పంచ్ (రామాయంపేట రూరల్)
మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో సామాన్య ప్రజానికం అతలాకుతలం అవుతున్నది. వంట గ్యాస్ ధర అమాంతం పెంచేసి సామాన్యుడి నడ్డివిరుస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన భారం చెప్పనక్కర్లేదు. ప్రజల ఉసురు పోసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలంటే అది ఒక్క కేసీఆర్కేతోనే సాధ్యం. ఇతర రాష్ర్టాల ప్రజలు కేసీఆర్ నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. దేశ ప్రజలకు సరైన న్యాయం జరగాలంటే సీఎం కేసీఆర్ తప్పకుండా ప్రధాని కావ్వాల్సిందే.
-అనిల్‌కుమార్ సర్పంచ్, వెంకటాపూర్(కె),(నిజాంపేట)