మాగనూరు : మాగనూర్ కృష్ణ ఉమ్మడి మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాలకు ( Grain Procurement Centers) అరకొర గన్నీ బ్యాగులు ( Gunny Bags ) సరఫరా అవుతున్నాయి. దీంతో రైతులకు పూర్తిస్థాయిలో అందక మండలంలోని రైతులు అరిగోస పడుతున్నారు. మహిళా సమాఖ్య, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 19 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
రైతులు పంట కోసి నెల రోజులు గడుస్తున్నా గన్నీ బ్యాగులను అందజేయకపోవడంతో అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఇప్పటివరకు 35 శాతం మాత్రమే రైతులు గన్నీ బ్యాగులు తీసుకున్నారని ఇంకా 75 శాతం గన్ని బ్యాగులు అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులను సంప్రదిస్తే అప్పుడూ, ఇప్పుడు వస్తాయంటూ సరైనా సమాధానం చెప్పలేక దాట వేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
శనివారం మాగనూరు మండల కేంద్రంలో వర్కర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రానికి దాదాపు వందమంది రైతులు గన్ని బ్యాగులకు రాగా 40 మందికి మాత్రమే పాతవి, చినిగిన గన్నీ బ్యాగులు పంపిణీ చేసి చేతులు దులుపేసుకున్నారు. వర్కూర్ లో అయితే గన్నీ బ్యాగులు లేక గ్రామ సమీపంలో ఉన్న రైస్ మిల్లులో రైతుల స్వయాన ట్రాక్టర్ల ద్వారా పాత గన్నీ బ్యాగులు తెచ్చుకున్న పరిస్థితి నెలకొంది. ఇంకొంతమందికి బ్యాగుల కోసం టోకెన్లు గన్ని ఇచ్చి 15 రోజులు గడుస్తున్నా ఇంత వరకు బ్యాగులు ఇవ్వలేకపోతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గన్ని బ్యాగుల కొరత లేకుండా, రైతులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారని రైతులు గుర్తు చేసుకున్నారు. ఇంకో పక్క వడ్లు నింపిన మిల్లులకు తరలించాలంటే లారీల యజమానులు, డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతుల నుంచి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.