వనపర్తి, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : చేనేత రంగానికి మంచిరోజులు వచ్చాయి. గత కేసీఆర్ ప్రభుత్వం చేనేతకు చేయూతనివ్వడంతో ఈ రంగం పురోగాభివృద్ధిలో పయనిస్తున్నది. మగ్గాల మీద చీరలు, బట్టలు నేసి పలు కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చేనేతకు పెట్టింది పేరుగా.. కొత్తకోట, గద్వాల, రాజోళి, నారాయణపేటతోపాటు అమరచింత పేరొందాయి. ఉమ్మడి రాష్ట్ర పాలనలో మగ్గం ఆడక ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి కరువైంది. కానీ తర్వాత 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వారికి వెన్నంటే నిలిచింది. దీంతో వందలాది నేతన్నల కుటుంబాలు జీవనోపాధి పొందడంతో చేనేతకు మళ్లీ జవసత్వాలు వచ్చాయి.
వనపర్తి జిల్లా అమరచింత మరో అడుగు ముందుకేసింది. ఇక్కడ తయారయ్యే చీరలను దేశంలోని పెద్ద నగరాలు, పట్టణాలకు ఎగుమతి అవుతున్నాయి. కొత్తగా నేత పని నేర్చుకోవాలనుకునే వారికి సైతం ఉచితంగా శిక్షణనిస్తూ అండగా నిలుస్తున్నారు. 2019లో ఎంఎస్ఎంఈ (మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్) ఆధ్వర్యంలో అమరచింత సిల్క్ హ్యాండ్లూం క్లస్టర్ పరిధిలో కామన్ ఫెసిలిటీ సెంటర్ గత మూడేళ్లుగా కొనసాగుతున్నది. సెంటర్లో ఒకేచోట 45 మగ్గాలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు ఇండ్ల వద్ద మరో 37 మగ్గాలు వీరి పరిధిలోనే నడుస్తున్నాయి. ఇలా మొత్తం దాదాపు 250 మంది కార్మికులు ఇక్కడ పని చేస్తూ చీరలను తయారు చేస్తున్నారు. గతంలోనూ ఇండ్ల వద్ద మగ్గాలను ఏర్పాటు చేసుకునే కార్మికులు, ఇప్పుడు నేరుగా సెంటర్‌కు వచ్చి పనులు చేసుకుంటున్నారు. అద్దె ఇండ్లు, చిన్నపాటి ఇళ్లు, గుడిసెలాంటివి ఉన్న నిరుపేదలు మగ్గాలను ఏర్పాటు చేసుకుని నేయడం కష్టం. అలాంటి వారందరికీ ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతున్నది. అందుకే గతంలోనూ అమరచింత చేనేత మంచి పేరు తెచ్చుకున్నది. ఈ సెంటర్ అనేక కుటుంబాలకు ఉపాధిని ఇవ్వడమే కాకుండా కొత్తగా నేత పని నేర్చుకునే వారికి సైతం ఉచితంగా శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఈ సెంటర్ అంచెలంచెలుగా ఎదుగుతూ చేనేతరంగానికి ఊతమిస్తున్నది.
45 మగ్గాల ద్వారా ప్రతినెలా దాదాపు 120 చీరలను నేతన్నలు తయారు చేస్తున్నారు. చీరల డిజైన్ల మేరకు ఒక్కో నెలలో చీరల ఉత్పత్తి అటు.. ఇటుగా ఉంటుంది. ఇక్కడ నేసిన చీరల ధరలు రూ.10 వేలు మొదలుకుని రూ.లక్ష వరకు ఒక్కో దాని ధర ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు ఇక్కడి చీరలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రతి రోజు 250 మంది వరకు కార్మికులు ఇక్కడ పని చేస్తారు. వీరిలో నేత పనిలో కొందరు ఉంటే, మరికొందరు ఇతర పనుల్లో సహాయకులుగా కొనసాగుతున్నారు. ఒక్క చీరను సిద్ధం చేయడానికి పది రోజుల సమయం తీసుకుంటున్నట్లు కార్మికులు చెబుతుండగా, ప్రతినెలలో ఒక మగ్గంపై కనీసం మూడు చీరలను సిద్ధం చేస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సెంటర్లో నేత పనులు కొనసాగుతున్నాయి. అయితే ఈ పనులు చేసే కార్మికులు నెలకు ఒక్కొక్కరూ రూ.10 నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నారు. ప్రతినెలా 5వ తేదీ వరకు బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు పొందుతున్నారు.
అమరచింతలో తయారైన చీరలు పక్క రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆర్డర్‌పై హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతోపాటు పలు నగరాలకు సరఫరా చేస్తున్నారు. వీటితోపాటు తెలంగాణలోని పలు జిల్లాలోని దుకాణాలు, షాపింగ్ మాల్స్‌లో ఇక్కడి చీరలే ఉంటున్నాయి. మున్సిపాలిటీలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి స్వయంగా విక్రయాలను చేపట్టడం విశేషం. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసే చేనేత సందర్శన కేంద్రాల్లోనూ ఇక్కడి చీరలను ప్రత్యేక స్టాల్స్ ద్వారా విక్రయిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే వారికి సైతం ఆర్డర్స్ మేరకు పంపిస్తున్నారు. గడచిన మూడేండ్లుగా జరిగిన విక్రయాలను చూస్తే 2021-22లో రూ.80 లక్షలు, 2022-23లో రూ.కోటీ 20 లక్షలు, 2023-24లో రూ.కోటీ 10 లక్షలు (ఇప్పటి వరకు) చేపట్టారు. దీంతో అంచలంచెలుగా ఈ సెంటర్ ఎదుగుతూ వచ్చింది.
వృత్తుల వారీగా చూస్తే.. చేనేతలో పద్మశాలీ కుటుంబాల వారు అధికంగా ఉంటారు. అయితే ఇప్పుడు చేనేతలో అందరూ కనిపిస్తున్నారు. ఆడ, మగ, కుల, మతాలకు తావులేకుండా ఉంటున్నారు. వాల్మీకులు, రజకులు, ముస్లింలు, పద్మశాలీ, ముదిరాజ్‌లు ఇలా అనేకంగా ఈ రంగంలో పనిచేస్తున్నారు. మధ్యలో కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్న చేనేతరంగ కార్మికులు, ఈ మూడేళ్ల నుంచి ఈ ప్రాంతంలో సెంటర్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. అమరచింతలో ఉండే కామన్ ఫెసెలిటీ సెంటర్లో అనేక మంది కొత్త వారు శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షకులకు 45 రోజులపాటు ఉచిత భోజన వసతి కల్పించి నేత పని నేర్పిస్తున్నారు. ఈ శిక్షణ అనంతరం ఇదే కేంద్రంలో పని చేయడం… లేదా సొంతంగా ఇంటి దగ్గరైనా పని చేసుకునే వెసలుబాటు కల్పిస్తున్నారు. ప్రతి ఏటా ఆడిట్ జరిపించిన అనంతరం వచ్చిన లాభాల్లో 40 శాతం వాటాను కార్మికులకు చెల్లిస్తారు. ఇదిలా ఉంటే కేవలం పని వచ్చిన వారికే కాకుండా కొత్త వారికి సైతం నేత శిక్షణ ఇవ్వడం, అలాగే టైలరింగ్లోనూ ఉచితంగా శిక్షణ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. చీరలతోపాటు పంజాబీ, షర్ట్స్, అయ్యప్ప దీక్ష వస్ర్తాలను ఆయా కంపెనీలు ఆర్డర్స్ మేరకు ఇక్కడ తయారు చేస్తున్నారు. ఇందుకు మరో పది మిషన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే కొత్త నేతను నేర్చుకునే వారికోసం మరో పది మగ్గాలను సెంటర్లో ఉంచారు.
నాకు చిన్ననాటి నుంచి సేద్యం పని రాదు.. నేత పని మాత్రమే వస్తది.. ప్రస్తుతం మా ఇళ్లు మరమ్మతు చేస్తు న్నాం. ఇంట్లో నే యడం కుదరదు. ఈ సెంటర్ ఉండడంతో ఎంతో సౌకర్యంగా ఉంది. ప్రతి నెలా రెండు సాధారణ చీరలను నేను ఒక్కదానినే నేస్తాను. అదే ఇంటి దగ్గరైతే నాలుగు చీరలకు వరకు తయారు చేస్తాను. నా భర్త వ్యవసాయం పనులకు వెళ్తాడు. నేను ఖాళీగా ఇంటిపట్టున ఉండడం ఎందుకని వచ్చిన పని చేసుకుంటే బాగుంటుందని సెంటర్‌కు వస్తున్నాను.
సెంటర్లో ప్రతి నెలా మూడు చీర లు నేస్తాను. ఒక్కో చీరకు రూ.4 వేల చొప్పున ఇస్తారు. నెలకు 12 వేలు వస్తాయి. ఇంట్లో కూడా మగ్గం ఉం డే కానీ, ఇబ్బంది అయింది.. సెంటర్ ఏర్పా టైన నాటి నుంచి ఇక్కడికే వస్తున్నాను.. ప్రారంభంలో షెడ్ పనులు జరిగినప్పుడు వాచ్‌మెన్‌గా పని చేశా. ఇప్పుడు సెంటర్ బాగా నడుస్తుంది. ఇబ్బంది అసలే లేదు.
25 ఏండ్లుగా నేత పనిలోనే ఉన్నా. మధ్యలో పని లేన ప్పుడు కొన్ని నెల లు కట్టె కోత మిషన్‌లో పని చేయ గా.. చేతికి గాయ మైంది. ఇప్పుడు సెంటర్లో పని బాగుంది. నెలకు మూడు నుంచి నాలుగు చీరలు నేస్తా. రూ.12 నుంచి రూ.15 వేల వరకు ఆదాయం వస్తుంది. చీరల డిజైన్ల మేరకు మాకు డబ్బులు వస్తాయి. నాతో పాటు నా భార్య కూడా ఇదే పని చేస్తుంది.