ఊట్కూర్, జూన్ 27 : కాలం దూరం చేసిన బంధాన్ని మానవత్వం మళ్లీ కలిపింది. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం తిప్రాస్పల్లి గ్రామానికి చెందిన కురువ భీమప్ప-ఎల్లమ్మ దంపతుల చిన్న కుమారుడు హన్మేశ్ (అలియాస్ తికిలప్ప)కు మాటలు సరిగ్గా రావు. ఈ క్రమంలో 13ఏండ్ల వయసులో హన్మేష్ గొర్రెలను వలస తీసుకెళ్లే క్రమంలో తప్పిపోయాడు. కుమారుడి కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయినా, ఎప్పటికైనా తిరిగి వస్తాడనే ఆశతో తల్లిదండ్రులు 11ఏళ్లుగా ఎదురుచూశారు.
ఇటీవల చెన్నైలోని ’మనసు’ స్వచ్ఛంద సంస్థ హన్మేష్ వివరాలను గుర్తించి గూగుల్ ద్వారా తిప్రాస్పల్లి గ్రామాన్ని గుర్తించి సర్పంచ్ విజయలక్ష్మికి సమాచారం అందించారు. సర్పంచ్ భర్త నర్సింహ చెన్నై వెళ్లి ధ్రువీకరణ ప్రక్రియను పూర్తిచేసి రెండు రోజుల కిందట హన్మేష్ను స్వగ్రామానికి తీసుకొచ్చారు. 13ఏళ్ల బాలుడిగా వెళ్లిన కుమారుడు 24ఏళ్ల యువకుడిగా ఇంటి గడప తొక్కడంతో తల్లిదండ్రులు ఆనందభాష్పాలతో అతడిని హత్తుకుని కన్నీటి కౌగిలిలో మునిగిపోయారు.
ఈ సందర్భంగా కుటుంబాన్ని మళ్లీ ఒక్కటి చేసిన ’మనసు’ స్వచ్ఛంద సంస్థ సేవలను గ్రామస్తులు అభినందించారు. దంపతులకు ముగ్గురు కొడుకులు, కుమార్తె ఉండగా 11 ఏళ్ల తర్వాత కుటుంబం కలవడంతో తిప్రాస్పల్లి గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.