మహబూబ్‌నగర్, జూలై 29 : ఆటోడ్రైవర్లు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని రాయల్ ఫంక్షన్హాల్లో శుక్రవారం ఆటోడ్రైవర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎస్పీ హాజరై మా ట్లాడారు. ఆటో డ్రైవర్లు చాలామంది మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి పెండ్లి చేసుకొని కొన్నాళ్ల తర్వాత వదిలించుకునేందుకు యత్నిస్తున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. ఆటోడ్రైవర్లు 80శాతం ప్రేమ పెండ్లి చేసుకుంటున్నారని, 30శాతం కేసుల్లో నిందితులుగా ఉంటున్నారని తెలిపారు. అమ్మాయిల జీవితాలను నాశనం చేయాలని చూస్తే సహించమన్నారు. కొందరు ఆటోలకు నెంబర్‌ప్లేట్ లేకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని సూచించారు. పట్టణంలో 7వేల ఆటోలు, జిల్లావ్యాప్తంగా మరో 7వేల ఆటో లు ఉన్నాయని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీ మహేశ్, ట్రాఫిక్ సీఐ అశోక్, టూటౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలి
మండలంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు సహకరించాలని ఎస్పీ వెంకటేశ్వర్లు కోరారు. నవాబ్‌పేట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భం గా రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా లో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గతంకంటే క్రైమ్ రేటు బాగా తగ్గిందన్నారు. మూఢ విశ్వాసాలను నిర్మూలించేందుకు గ్రామాల్లో పోలీ స్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట డీఎస్పీ మహేశ్, రూరల్ సీఐ రాజేశ్వర్‌గౌడ్, ఎస్సై శ్రీకాంత్, ఏఎస్సై ఆనంద్ ఉన్నారు.
హన్వాడ పోలీస్‌స్టేషన్ తనిఖీ
హన్వాడ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి కేసుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ మహేశ్, ఎస్సై తిరుపాజీ ఉన్నారు.